కోళ్లకు సరికొత్త వైరస్ వి.వి.ఎన్.డి.(Very Virulent Newcastle Disease) సోకుతూ ఉండడంతో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలోని అధికారులు ప్రస్తుతం చాలా అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లు చనిపోతూ ఉండడం.. అలాగే నాటుకోళ్లు కూడా వరుసగా చనిపోతూ ఉండడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. దాదాపు 2500 ఫారం కోళ్లు, వేలాది నాటు కోళ్లు చనిపోవడంతో పెంపకందార్లలో భయం మొదలైంది. వెటర్నరీ డాక్టర్లు కూడా వైరస్ వచ్చిన కోళ్లను తినకూడదని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని తణుకు మున్సిపాలిటీలో వారం రోజుల పాటూ మాంసాహారాన్ని అమ్మడం.. తినడం బ్యాన్ చేశారు. వి.వి.ఎన్.డి. సోకిన కోళ్లను తినడం చాలా ప్రమాదకరమని తెలుస్తోంది.

వి.వి.ఎన్.డి. సాధారణంగా పక్షులకు వచ్చే రోగమే.. కానీ ఇప్పుడు గోదావరి బెల్ట్ లో పెంపకందారులను తెగ టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఫారం కోళ్లకు వ్యాక్సిన్లు ఇస్తూ ఉండడం వలన ఈ రోగం రాకుండా అరికట్టొచ్చు.. కానీ ఈసారి వాటికి వ్యాక్సిన్లు ఇచ్చినా కూడా మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా కోళ్లు చనిపోగా.. వెస్ట్ గోదావరి జిల్లా లోని కొన్ని గ్రామాలను కూడా సోకింది. దీంతో పశు సంవర్ధక విభాగం అధికారులు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.టి.శ్రీనివాస రావు మాట్లాడుతూ బడుగువాని లంక గ్రామంలో 2500 బ్రాయిలర్ కోళ్లు చనిపోయాయని.. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. ఒక్క కోడికి సోకినా.. మిగిలిన వాటన్నిటికీ సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తమ విభాగం ఎప్పటికప్పుడు కోళ్లకు వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటామని.. ముందుగా అప్రమత్తమై మిగతా జిల్లాలకు వ్యాక్సిన్లను పంపినట్లు తెలిపారు.

ఏరుబండి ప్రసాద్ కు చెందిన పౌల్ట్రీ ఫామ్ లో చాలా వరకూ కోళ్లు చనిపోయాయి. వాటిని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లగా ఆ పక్షులకు వి.వి.ఎన్.డి. సోకిందని చెప్పారని.. తాను లక్షల్లో నష్టపోయాయని ప్రసాద్ వాపోయారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు జన సంచారం లేని ప్రాంతంలో పక్షులను పాతిపెట్టారు. ఫారం కోళ్లకే కాకుండా నాటు కోళ్లకు కూడా ఇది సోకే అవకాశం ఉందని.. వాటికి వ్యాక్సిన్లు వేసినప్పటికీ కాపాడుకోవడం కష్టమేనని అంటున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story