రోహిత్, ధావన్ లేకుంటే.. వారిద్దరేనా ఓపెనర్లు..?
By Newsmeter.Network Published on 4 Feb 2020 4:18 PM GMT
టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన ఇక వన్డే సిరీస్ పై కన్నేసింది. సెడాన్ పార్కు వేదికగా బుధవారం నుంచి టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా అదే ఊపులో వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. వన్డేల్లో తమ సత్తా చాటాలని కివీస్ పట్టుదలతో ఉంది.
భారత రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ల దూరం కావడంతో టీమిండియ కొత్త ఓపెనింగ్ జోడీకి శ్రీకారం చుట్టనుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో భారీ మార్పులు ఉంటాయని రాహుల్ ను ఐదో స్థానంలో ఆడిస్తామని కోహ్లి ఇప్పటికే చెప్పడంతో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా వన్డేల్లో అరగ్రేటం చేయనున్నారు. వీరిద్దరు భారత ఇన్నింగ్స్ ను ఆరభించనున్నారు. మిడిల్ ఆర్డర్ లో ఎటు వంటి మార్పులు ఉండకపోవచ్చు. వన్‌డౌన్‌లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రానుండగా నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నాడు. లోకేష్ రాహుల్ ఐదో స్థానంలో, మనీష్ పాండే ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నారు. కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, పాండే లు సూపర్ ఫామ్ లో ఉండడం భారత్ కలిసి వచ్చే అంశం.
ఇక అరగ్రేట ఆటగాళ్లు పృథ్వీ, మయాంక్ అగర్వాల్ లు సుధీర్ఘ ఫ్మారాట్ లో సత్తాచాటుకున్న.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎలా రాణిస్తారు అన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బరిలోకి దిగుతుండగా.. నవదీప్‌సైనీ లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కవచ్చు. ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా, శివబ్ దూబేలలో ఒకరికే అవకాశం. టీ20ల్లో విఫలమైన దూబే పై వేటు పడవచ్చు. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్‌గా యజ్వేంద్ర చాహల్ వైపు కోహ్లీ ముగ్గు చూపవచ్చు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయి.
ఇప్పటికే టీ20ల్లో భారత్ చేతిలో వైట్ వాష్ కు గురైన కివీస్ తీవ్రఒత్తిడిలో ఉంది. ఇది చాలదు అన్నట్లు.. మూడో టీ20లో గాయపడ్డ ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియన్స్ ఇంకా కోలుకోలేదు. మొదటి రెండు వన్డేలకు అతను అందుబాటులో ఉండడని కివీస్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కేన్ స్థానంలో మార్క్ చాప్‌మన్ జట్టులోకి తీసుకున్నారు. టామ్ లాథమ్ జట్టును నడిపిస్తాడు. ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ టీమ్‌లోకి రావడం సానుకూలాంశం. కివీస్ బ్యాటింగ్ భారం మొత్తం సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ పైనే పడింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్ రాణించాలని టీమ్‌మేనెజ్‌మెంట్ ఆశిస్తోంది. ఆల్‌రౌండర్లు కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిషెల్ సాంట్నర్‌లపై కూడా ఆ జట్టు బారీ ఆశలు పెట్టుకుంది. టీ20ల్లో ఒత్తిడికి తలొగ్గిన కివీస్ ఆటగాళ్లు తమకు అచ్చొచ్చిన వన్డేల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.