పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ నగరి బెంగళూరులో ఇప్పటికే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్ పండుగకు మరొకరోజే గడువుంది. నగరమంతా సందడి వాతావరణం. ఇంతలోనే పోలీసులు జారీ చేసిన కొత్త నిబంధనలతో ప్రజల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లయింది. రెండు పండుగల నేపథ్యంలో పోలీసులు బెంగళూరు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మద్యం బాబులకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ ’ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోను మద్యం తాగి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. ఇదే నిబంధన న్యూ ఇయర్‌కూ వర్తించనుంది. కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడైనా జరుపుకోవ చ్చు అనుకుంటే పోలీసుల నుంచి కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ముమ్మరంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. న్యూ ఇయర్ రోజు సరదాగా గడుపుదామని భావించే నగర ప్రజల కాళ్లకు బంధమేసినట్లయింది.

ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన నగరాలలో సైతం న్యూ ఇయర్ వేడుకలు పోలీసుల ఆంక్షల మధ్య జరుగనున్నాయి. అర్థరాత్రి 1 గంట తర్వాత రోడ్లపై తిరగరాదని, ఇష్టారాజ్యంగా తాగి యువతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కో ఈవెంట్ లో అయితే తాగినోడికి తాగినంత అన్నట్లుగా మద్యం ఏరులై పారుతుంటుంది. అలాంటి ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో పోలీసుల పికెటింగ్ ఎక్కువగా ఉంటుంది. దిశ హత్యోదంతం నేపథ్యంలో యువతులు ఎవరి తోడు లేకుండా బయట తిరగరాదని, స్నేహితులే కదా అని నమ్మి వారివెంట వెళ్లరాదని పోలీసులు సూచిస్తున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story