అంటార్కిటికాలో కరిగిన మంచు.. ఏమి బయటపడిందంటే..?  

By Newsmeter.Network  Published on  3 March 2020 12:25 PM GMT
అంటార్కిటికాలో కరిగిన మంచు.. ఏమి బయటపడిందంటే..?  

అంటార్కిటికాలో ఇటీవలి కాలంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో మంచు కూడా చాలా ఎక్కువగా కరిగిపోతోంది. అలా కరిగిపోతున్న మంచు కారణంగా ఓ ద్వీపం బయట పడింది. పైనున్న మంచంతా కరిగిపోవడంతో అక్కడ ఓ ద్వీపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ద్వీపానికి 'సిఫ్ ఐలాండ్' అనే పేరు పెట్టారు. థ్వైట్స్ గ్లాసియర్ వద్ద ఉన్న మంచు చాలా వరకూ కరిగిపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఆ తర్వాత గోధుమ రంగులో చిన్న ప్రాంతం బయటపడింది. దాన్ని పరిశీలించగా.. అదొక ద్వీపం అని గుర్తించారు. దాదాపు 1150 అడుగుల వైశాల్యంలో విస్తరించినట్లు గుర్తించారు. వోల్కానిక్ గ్రానైట్ గా దాన్ని గుర్తించారు. సీల్స్ లాంటి జీవ చరాలు అక్కడ బ్రతుకగలవు. 'గ్లాసియల్ రీబౌండ్' కారణంగా ఈ ద్వీపం అన్నది బయటకు వచ్చిందని జియాలజిస్టులు చెబుతున్నారు. ఎప్పుడైతే మంచు కరగడం మొదలవుతుందో.. దాని కింద ఉన్న భూభాగంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. అలా జరిగినప్పుడు ఆ భూభాగం అన్నది 'రీబౌండ్' అవుతుందని.. దాని సాధారణ స్థాయి కంటే మరింత పైకి వస్తుందని అన్నారు. అలాగే ఇప్పుడు 'సిఫ్ ఐలాండ్' బయటకు వచ్చింది. మార్చి 25 వరకూ బ్రెజిలియన్ శాత్రవేత్తలు అంటార్కిటికాలో మరింత రీసర్చ్ చేయనున్నారు.

ఫిబ్రవరి 9న బ్రెజిలియన్ శాత్రవేత్తలు అంటార్కిటికా ద్వీప కల్పంలో ఉన్న ‘సేమర్ ఐలాండ్’ లో ఏకంగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు. అంటార్కిటికా ముఖ్యభాగంలో ఫిబ్రవరి 6 న ఏకంగా 18.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని అర్జెంటీనాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫిబ్రవరి 6 న సేమర్ ఐలాండ్ లో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు మరో బృందం తెలిపింది. ఇవి అంటార్కిటికా ఉష్ణోగ్రతల్లో అత్యధిక రికార్డులు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

1982, జనవరి నెలలో అంటార్కిటికాలోని ‘సిగ్ని ద్వీపం’ లో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇప్పటి వరకూ అంటార్కిటికాలో అదే అత్యధిక ఉష్ణోగ్రత.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. రానున్న రోజుల్లో అక్కడ వేడి మరింత పెరిగిపోయే అవకాశం ఉందని World Meteorologial Organisation (WMO) చెబుతోంది. గ్లోబల్ హీటింగ్ కారణంగా అంటార్కిటికాలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతోంది. అంటార్కిటికాలోని రిమోట్ మానిటరింగ్ స్టేషన్స్ నుండి వాతావరణ డేటాను కలెక్ట్ చేసే శాస్త్రవేతలు ఆ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూసి షాక్ అవుతున్నారు.

1979 నుండి 1990 వరకూ ఒక్కో ఏడాది 40 బిలియన్ల టన్నుల మంచు కరుగుతూ ఉండగా.. 2009 నుండి ఒక్కో ఏడాదికి 250 బిలియన్ టన్నుల మంచు కరుగుతూ వస్తోంది. దాదాపు ఆరు రెట్లు వేగంగా మంచు కరుగుతోంది. అంటార్కిటికాలో మంచు విపరీతంగా కరగడం వలన సముద్ర మట్టం కూడా పెరగనుంది. పర్యావరణానికి మనుషులు చేస్తున్న నష్టం వలన భూతాపం పెరిగిపోతోంది. ఇప్పటికే విపరీతమైన వేడి గాలులు, తుఫానులు.. భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

Next Story