భూమ్మీద నూకలు రాసిపెట్టుంటే..!

By Newsmeter.Network  Published on  17 Jan 2020 11:10 AM GMT
భూమ్మీద నూకలు రాసిపెట్టుంటే..!

ముఖ్యాంశాలు

· నీలమ్ వ్యాలీలో భారీ మంచు తుపాను

· పెద్ద ఎత్తున విరిగిపడ్డ మంచు పెళ్లలు

· మంచు పెళ్లల కింద భూస్థాపితమైన జనం

· 80మంది మృతులు ఉండొచ్చని అంచనా

· 18 గంటలపాటు శిధిలాల్లో సమీనా బీబీ

· రక్షించమంటూ కేకలు పెట్టిన సమీనా బీబీ

· సమీనాను బైటికి తీసిన రెస్య్కూ టీమ్స్

· ముజఫరాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలింపు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అతి పెద్ద మంచు తుఫాను విరుచుకు పడింది. మంచు పెళ్లలు అమాంతంగా విరుచుకుపడి పెద్ద ఎత్తున ఇళ్లకు ఇళ్లనే నేలమట్టం చేశాయి. నిజానికి నేలమట్టం చేశాయి అని చెప్పడం కంటే పూర్తిగా ఉన్న పళంగా భూస్థాపితం చేశాయి అని చెబితేనే సబబుగా ఉంటుందేమో. ఈ ఎవలాంటీ దాదాపుగా 80మంది ప్రాణాల్ని మంచుగుట్టలకింద నిశ్శబ్దంగా భూమిలో కలిపేసింది. నేరుగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హిమాలయాల్లో ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు. మంచు తుఫానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం, పహారా కాస్తున్న మన జవాన్లుకూడా తరచూ ప్రమాదాల బారిన పడడం మనకందరికీ తెలిసిన విషయమే. అంతటి కఠినతరమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన వీర జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తున్నారంటే వాళ్ల ఋణాన్ని మనం అసలు ఏ విధంగా తీర్చుకోగలమో దేశ పౌరులందరూ కనీసం ఒక్కసారైనా ఆలోచించాలి.

ఇక అసలు విషయానికి వస్తే ఊహించని ఉప్పెనై ముంచుకొచ్చి ఎవలాంటీ ఉన్నపళంగా ఇళ్లకు ఇళ్లనే భూమిలో పాతరేసింది. పాక్ జవాన్లు, స్థానికులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. గంటలు గడిచినకొద్దీ గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. కానీ ఓ పన్నెండేళ్ల పాప మాత్రం సురక్షితంగా ఉన్నపళంగా, ఉన్నది ఉన్నట్టుగానే ఆ మంచు గుట్టల కింద కూరుకుపోయింది. ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులందరూ మట్టిలో.. కాదు కాదు మంచు ముద్దల్లో కలిసిపోయారు. అదృష్టవశాత్తూ బతికి బైటపడ్డ క్షతగాత్రులందరినీ ముజఫరాబాద్ లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు.

కానీ ఈ పన్నెండేళ్ల పాప మాత్రం 18 గంటలపాటు ఉన్నచోటే కదలకుండా ఉండిపోయింది. ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారన్న ఆమె ఆశ అడియాస కాలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టిన బృందాలకు తనను కాపాడమంటూ ఆమె వేసిన కేకలు వినిపించాయి. అతి కష్టం మీద మంచు పెళ్లల్ని తొలగించిన చూసినా రెస్క్యూ బృందానికి ఆ పాపాయి ఉన్నచోటే అలాగే ముడుచుకుని కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రమాదం నుంచి బైటపడిన పన్నెండేళ్ల సమీనా బీబీ కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మంచు పెళ్లలకింద నలిగి నుజ్జైపోయింది. కానీ ఈ పాప ఉన్న గదిమీద భారీ స్థాయిలో మంచు పెళ్లలు పడ్డా ఆ గది మాత్రం చెక్కు చెదరలేదు. కళ్లముందే తనవాళ్లంతా ఉన్నపళంగా ప్రాణాలు విడిచిన ఘటనకు ఆ పాప షాక్ తింది. ఆఖరికి సైమా బీబీ మూడేళ్ల చిన్నారి చెల్లెలు, తమ్ముడుకూడా ఈ ప్రమాదంలో ఆమె కళ్లముందే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదంలో సమీనా బీబీ కాలు విరిగిపోయింది. అస్సలు కదిలే పరిస్థితిలో లేని ఆమెకు ముజఫరాబాద్ మిలటరీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి చికిత్సను అందిస్తున్నారు. తినడానికి తిండి లేక, కంటిమీద కునుకులేకుండా ప్రాణాలను చిక్కబట్టుకుని సమీనా 18 గంటలపాటు ఆ మంచు ముద్దల కింద ప్రాణాలను చిక్కబట్టుకుని ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం. రెప్పపాటు కాలంలో కళ్లముందే తన కుటుంబసభ్యులందరూ ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత విషాదకరమైన అంశమే అయినా కనీసం ఆమె ప్రాణాలైనా దక్కడ కొంతలో కొంత అదృష్టమని స్థానికులు అంటున్నారు.

Next Story