ఇంత ఆందోళనల్లో ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది ? : నారా లోకేశ్

By రాణి  Published on  20 Jan 2020 9:52 AM GMT
ఇంత ఆందోళనల్లో ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది ? : నారా లోకేశ్

  • ఇండో పాక్ బోర్డర్ లో కూడా ఇంతమంది పోలీసులు ఉండరు

ప్రపంచంలో ఎక్కడా సఫలం కాని విధానాన్ని ఈ తుగ్లక్ సీఎం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తిరస్కరించి తీరుతామన్నారు. మండలిలో ఈ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని లోకేశ్ హెచ్చరించారు.

అంతకుముందు ట్విట్టర్ లో రైతులపై జరుగుతున్న దాడుల గురించి స్పందించిన లోకేష్.. ''ఇంటికి పది మంది పోలీసులా? ఇళ్ల ముందు నెట్లు పట్టుకొని నిలబడటం ఏంటి? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా? ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడగటం ప్రజలు చేసిన తప్పా? అని లోకేష్ ప్రశ్నించారు.



అడుగుకో పోలీసు, లాఠీలు, ముళ్ల కంచెలతో రాజధానిని తరలించాలి అనే పట్టుదల ఎందుకు? రాజధాని విభజన నిర్ణయంలో పసలేదు కాబట్టే వైకాపా ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది. శాసనసభలో చేసిన తీర్మానాలకు, చెప్పిన మాటలకు విలువ లేనప్పుడు ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం ఎక్కడ ఉంటుంది? 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని'. మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో అసెంబ్లీ ముందు నిరసన తెలిపాం. ఎంత మంది పోలీసుల్ని దింపినా ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదు. అమరావతిని కాపాడుకోవాలి అనే కాంక్ష ప్రజల్ని అసెంబ్లీ వరకూ తీసుకొచ్చింది. భూములు ఇచ్చిన రైతులను ఇంత దారుణంగా హింసించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా @ysjagan గారు చరిత్రలో నిలిచిపోతారు. తప్పుచేసే దొంగలే ఇలా దొడ్డిదారిన తప్పించుకు తిరుగుతారు.'' అని విమర్శలు చేశారు.



'' అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేసారు. ఇప్పుడు నిజంగా ఈ జనప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి. మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధనాలను చేధించుకుని ఎలా వెల్లువెత్తారో చూసాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా?'' అని ప్రశ్నించారు.

''ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి

అసెంబ్లీని ముట్టడిస్తుంటే... మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే... ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది? '' అని నారా లోకేశ్ జగన్ అసెంబ్లీ సమావేశంలో నిద్రిస్తున్నట్లుగా ఉన్న విజువల్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.



Next Story