ఈ ఏడాది ఇండియా అపరకుబేరుడి సంపద ఎంతో తెలుసా ?

By రాణి  Published on  24 Dec 2019 6:52 AM GMT
ఈ ఏడాది ఇండియా అపరకుబేరుడి సంపద ఎంతో తెలుసా ?

ముంబై : ఇండియా అపరకుబేరుడు, ఆసియా సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 2019లో ఎంతకు పెరిగిందో తెలుసా..అక్షరాలా 17 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.2 లక్షల కోట్లన్నమాట. దీంతో డిసెంబర్ 23 నాటికి అంబానీ సంపద 61 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4.3 లక్షల కోట్లు పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ షేర్లు 40 శాతం పెరగడంతో అంబానీ సంపద పెరిగింది.

2016లో రిలయన్స్ తెచ్చిన జియో అనతికాలంలోనే భారత్ లో అగ్రగామి టెలికాం ఆపరేటర్ గా ఎదిగి, తిరుగులేని విజయం సాధించింది. మూడేళ్లలో రిలయన్స్ షేర్లు మూడింతలు పెరగడం విశేషం. జియో ఇచ్చిన నూతనోత్సాహంతో రిలయన్స్ సంస్థను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు అంబానీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. 2021 ప్రారంభమయ్యే సమయానికి రిలయన్స్ గ్రూప్ అప్పులు లేకుండా చూస్తామని ముఖేష్ అంబానీ ఇటీవలే ప్రకటించారు కూడా.

అలాగే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా సంపద 11.3 బిలియన్ డాలర్లకు పెరగగా..అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ఇందుకు కారణం కూడా ఉంది. అదేమిటంటే జెస్ బెజోస్ తన భార్యకు విడాకులిచ్చిన సమయంలో జెస్ తన ఆస్తిలో సగం ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది. అందుకే జెస్ బెజోస్ సంపద ఈ ఏడాది తగ్గినట్లు తెలుస్తోంది.

Next Story