అందరి చూపు.. ధోని వైపు

By Newsmeter.Network  Published on  16 Feb 2020 11:33 AM GMT
అందరి చూపు.. ధోని వైపు

ఐపీఎల్‌-2020 సీజన్‌ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 29 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఇప్పుడు అందరి చూపు.. టీమిండియా మాజీ కెప్టెన్‌, చైన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పై పడింది. గతేడాది జరిగిన ప్రపంచకప్‌ కప్‌ సైమీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ధోని మైదానంలో కనిపించలేదు. కొంత కాలం క్రికెట్‌ కు విరామం ప్రకటించిన ధోని.. కొద్ది రోజులు సైనికుడిగా విధులు నిర్తర్వించాడు.

ధోని కెరీర్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కెప్టెన్‌ కోహ్లీ కొంత స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి ధోని రిటైర్‌మెంట్‌ పై ఊహాగానాలు ఆగలేదు. ఓ సందర్భంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోని ఉంటాడా..? అని. ఐపీఎల్‌ ఫామ్‌ ఆధారంగానే ధోని వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడో లేదో నిర్ణయిస్తామని రవిశాస్త్రి సమాధానమిచ్చాడు. ధోని సన్నిహితులు కూడా.. ఐపీఎల్‌లో ధోని రాణిస్తేనే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ధోనిపై పడింది.

ఇప్పటికే ధోని.. ఐపీఎల్‌కు సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. మార్చి 29న ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ నేపధ్యంలో మార్చి 1న ధోని చైన్నై చేరుకుంటాడని తెలుస్తోంది. నిజానికి గ‌తేడాది మార్చి 15న ఐపీఎల్ ప్రాక్టీస్‌లోకి దిగిన ధోనీ.. ఈసారి రెండు వారాల‌ముందుగానే స‌న్నాహ‌కాలు ప్రారంభించ‌నున్నాడు. చెన్నై సొంత‌మైదానం చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేయ‌నున్నాడు. అత‌నితో పాటు సురేశ్ రైనా, అంబ‌టి తిరుప‌తి రాయుడులు తోడుగా కసరత్తులు చేస్తారు. మ‌రోవైపు ఐపీఎల్లో చెన్నైకి మంచి రికార్డు ఉంది. ధోనీ నాయకత్వంలో మూడు సార్లు విజేత‌గా నిలిచింది.

Next Story