ధోని ప్రాక్టీస్‌.. దద్దరిల్లిన స్టేడియం

By Newsmeter.Network  Published on  3 March 2020 7:37 AM GMT
ధోని ప్రాక్టీస్‌.. దద్దరిల్లిన స్టేడియం

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అభిమానులు ఏ రేంజ్‌లో ఉంటారో చెప్పనక్కరలేదు. 2019 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ అనంతరం ఈ కూల్ కెప్టెన్‌ క్రికెట్‌కు నుంచి కొంత విరామం తీసుకున్నాడు. కొంతకాలం సైన్యంలో పని చేశాడి ఈ జార్ఖండ్‌ డైనమెట్. మార్చి 29 నుంచి ఐపీఎల్-13వ సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు ముందే ఐపీఎల్ సీజన్‌ వచ్చేసింది. దానికి కారణం ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రుడు మళ్లీ బ్యాట్‌ పట్టడమే.

సోమవారం ఎంఏ చిదరంబరం స్టేడియంలో ధోని క్రికెట్‌ సాధన మొదలుపెట్టాడు. నెట్స్‌లో కాసేపు బ్యాటింగ్‌ సాధన చేశాడు. ధోని స్టేడియానికి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. తమ అభిమాన క్రికెటర్‌ బ్యాట్‌పట్టి అడుగుపెట్టే సమయంలో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ధోని బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు ధోని ధోని అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులతో ట్విట్టర్‌లో పంచుకుంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'తలైవా.. ధోని వచ్చాడని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ధోని కెప్టెన్సీలో చెన్నై మరోసారి కప్‌ కొట్టడం ఖాయం' అని ఇంకో అభిమాని ట్వీట్‌ చేశాడు.

మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2020 సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయ్‌ ఇండియన్స్‌తో చెన్నై తలపడుతోంది. ఇదిలా ఉండగా.. చిదంబరం స్టేడియంలో చెన్నై ఆటగాళ్లు ఎప్పుడు సాధన చేస్తున్నా.. స్థానిక అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌.. పియూష్ చావ్లా, ఆస్ట్రేలియా పేసర్‌ జోస్ హేజిల్‌వుడ్‌, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌, తమిళనాడు ఎడమచేతి వాటం స్పిన్నర్‌ ఆర్‌ సాయి కిషోర్‌ వేలంలో సొంతం చేసుకుంది.

ఇకపోతే ధోనికి కూడా ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో ధోని ఎంపికవ్వాలంటే.. ఐపీఎల్‌లో రాణించడం తప్పనిసరి. ధోని ఐపీఎల్‌లో రాణిస్తే తన రిటైర్‌మెంట్ పై వస్తున్న వార్తలకు చెక్‌ పడడం ఖాయం.



Next Story