అత్యాచారం చేశారు.. కేసు వెనక్కి తీసుకోలేదని బాధితురాలి తల్లిని..
By Newsmeter.Network Published on 18 Jan 2020 1:31 PM IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచార కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలి తల్లి నిరాకరించిందని నిందితులు కొట్టి చంపారు. పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు కాన్పూర్‌కు చెందిన ఓ బాలిక (13)పై అబిద్, మింటు, మెహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు నిందితులపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలు కు పంపారు.
ఇటీవల నిందితులు బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి కేసు వాపసు తీసుకోమని బెదిరించారు. ఇందుకు బాలిక తల్లి నిరాకరించింది. రెచ్చిపోయిన నిందితులు బాలికను, ఆమె తల్లిని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది.
కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో ఇద్దరు నిందితులను కాళ్లపై తుపాకీతో కాల్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు.