ఆమెకు వాహనాలు అంటే చాలా ఇష్టం..! అలాగని సాధారణ అమ్మాయిల లాగా బైక్ రైడింగ్ అంటేనో, కార్లలో షికారు చేయడమో ఇష్టం కాదు.. వాహనాలకు మోడిఫికేషన్ చేయడం.. వాటిని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా రూపొందించడం..! పర్యావరణానికి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండేలా వాటిని తయారు చేయడం.

ఆమె ఎవరో కాదు హైదరాబాద్ కు చెందిన రమ్య ప్రియ. పాత మోపెడ్ ను కాస్తా ఆమె హైబ్రిడ్ బైక్ గా మార్చివేసింది. ఆ బైక్ కాస్తా పెట్రోల్ తోనే బ్యాటరీతో కూడా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ కు చెందిన రమ్య ప్రియ చాలా ఏళ్లుగా వెహికల్ మోడిఫికేషన్ ను నేర్చుకుంటూ ఉంది. తాను నేర్చుకున్న చదువుతో 1994 కు చెందిన టీవీఎస్ ఎక్స్ఎల్ కు పలు మార్పులు చేసింది. ఎక్స్టీరియర్ ఫిట్టింగ్స్ ను మార్చడమే కాకుండా.. మోటార్ బ్యాటరీతోనూ, ఇంధనంతోనూ పనిచేసేలా మార్పులు చేసింది. ఇందుకు ఆమె కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే తీసుకుంది. పాత కాలం నాటి మోపెడ్ ను కాస్తా హైబ్రిడ్ వాహనంగా మార్చేసిందంటే ఆమె ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మూడు గంటలు ఛార్జింగ్ పెడితే..50 గంటలు

కేవలం మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే ఈ హైబ్రిడ్ వాహనం 50 కిలోమీటర్లు వెళ్లగలదని ఆమె చెబుతోంది. ఒక వేళ బ్యాటరీ అయిపోతే పెట్రోల్ వేసుకుని నడపొచ్చు అని చెబుతోంది రమ్య. హైదరాబాద్ లో స్కూలింగ్ అయిపోయాక.. తమిళనాడు లోని పెరియార్ యూనివర్సిటీలో బిబిఏ చదివింది రమ్య ప్రియ. ఆమె తల్లి ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉండగా.. ఆమె తండ్రి బిహెచ్ఈఎల్ లో ఉద్యోగం చేసి పదవీవిరమణ పొందారు. తనకు చిన్నప్పటి నుండే కార్లు, బైకులు అంటే చాలా ఇష్టమని.. ఢిల్లీ లోని ఎయిర్ నాక్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక సంవత్సరం పాటూ ఆటోమోటివ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మోడిఫికేషన్స్ కోర్సును చేశాక హైబ్రిడ్ బైక్ ను తయారు చేయడం పెద్ద కష్టం కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. యూకేలో ఎలెక్ట్రిక్ బైక్స్ తయారుచేసే స్టార్టప్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమె సోదరుడు కూడా అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు. కానీ రమ్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

‘నా ఇన్నోవేషన్స్ మొత్తం భారత్ లోనే జరగాలని.. భారత్ కే ఉపయోగపడాలని’ ఆమె చెబుతోంది. 28 సంవత్సరాల రమ్యకు ఇలాంటి వాహనాలు తయారుచేయడం కొత్తేమీ కాదు.. గతేడాది ఆమె ఎలెక్ట్రిక్ పెడల్ బైక్ ను మూడు రోజుల్లోనే తయారు చేసింది. బ్యాటరీ ఉన్నంత వరకూ ఆ బైక్ ఎంత దూరం అయినా వెళుతుంది. అదే ఛార్జింగ్ అయిపోతే హ్యాపీగా తొక్కుకుంటూ వచ్చేయచ్చట. రమ్య ప్రస్తుతం మల్టీ పర్పస్ వెహికల్స్ ను తయారు చేయడంలో బిజీగా ఉంది. డెలివరీ వర్కర్లకు, డైరీ ఫార్మ్స్ కు ఉపయోగపడేలా వాహనాన్ని రూపొందించాలని ఆమె భావిస్తోంది. అతి తక్కువ ధరకే పర్యావరణానికి ఎటువంటి హాని చేయని వాహనాలను రూపొందించాలని ఆమె భావిస్తోంది. అలాగే ఎకో-ఫ్రెండ్లీ బైక్స్ ను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం కూడా ఆమె ఎదురుచూస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.