అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా?

By Newsmeter.Network  Published on  3 March 2020 1:23 PM GMT
అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా?

అధికారం పోవడంతో టీడీపీ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. తమకు నచ్చిన బ్రాండ్స్‌ లేవని టీడీపీ నేతలు మాట్లాడడం సిగ్గు చేటని, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేతో శాసనసభలో మద్యం బ్రాండ్స్‌ గురించి మాట్లాడించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. మద్యం ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు టీడీపీ నేతలు భాధపడుతున్నారన్నారని ఎద్దేవాచేశారు.

అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కిందన్న విషయం అన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉందని, చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో లిక్కర్ బ్రాండ్స్ ను తన ముందు పెట్టుకుని కూర్చున్న బోండా ఉమ.. వైన్ షాపులోనో, బార్ లోనో ఓ సేల్స్ మెన్ లా ఉన్నారని, ‘అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా? అది పార్టీ ఆఫీసా? చంద్రన్న బెల్టు షాపా?’అనే అనుమానం తలెత్తుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే కల్లు తాగిన కోతులు ఎలా వ్యవహరిస్తాయో టీడీపీ నేతలూ అలా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎవరైతే మద్యానికి బానిసలయ్యారో, వాళ్లను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి బాగు చేయాలని అనుకున్నామంటూ సెటైర్లు విసిరారు.

Next Story
Share it