నింద నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆర్కే..

By రాణి  Published on  3 Jan 2020 10:50 AM GMT
నింద నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆర్కే..

వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే టీడీపీ నేత బొండా ఉమాకు సవాల్ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో తన భార్య పేరిట 5 ఎకరాల భూమి ఉందని నిరూపిస్తే..శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలా నిరూపిస్తే వెంటనే నిరూపించిన వారికే ఆ భూమిని రిజిస్ర్టేషన్ చేయించి ఇస్తానన్నారు. నిజానికి చంద్రబాబే రాజధానికి పెద్ద శాపమని ఆర్కే ఆరోపించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని ఆర్కే ప్రశ్నించారు.

విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని టీడీపీ గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెరపైకి ఎమ్మెల్యే ఆళ్ల పేరొచ్చింది. ఆయనకు అమరావతిలో భూములున్నాయని టీడీపీ నేత బొండా ఉమ గురువారం మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. ఏది ఇన్ సైడ్ ? ఎవరిది ట్రేడింగ్ ? తేల్చేద్దాం రండి. వైసీపీ ఆఫీస్ లోనే చర్చకు సిద్ధం అంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. వైజాగ్ లో రాజధాని వల్ల అక్కడున్న వైసీపీవాళ్ల ఆస్తుల రేట్లు పెరుగుతాయని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. అలాగే అమరావతిలో చంద్రబాబు బినామీల పేర్ల మీద చాలా ఆస్తులున్నాయని, అందుకే తనకు అనుకూలంగా అమరావతిని రాజధాని చేస్తే ఏం ఉపయోగం ఉండదని తెలిసినా...అక్కడే నిర్మాణాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని వాదులాడుకుంటున్న నేతలు బాగానే ఉంటున్నారు గానీ..ఎటొచ్చి నష్టపోయిందల్లా రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతులు.

Next Story