స్కూల్ టీచర్ అవాతరమెత్తిన మంత్రి హరీష్ రావు

By రాణి  Published on  28 Dec 2019 1:27 PM GMT
స్కూల్ టీచర్ అవాతరమెత్తిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి : తెలంగాణ రాష్ర్ట మంత్రి హరీష్ రావు శనివారం సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం జడ్పీ హై స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆయన ఉన్నట్లుండి టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులను అన్ని రకాల సబ్జెక్టులకు చెందిన ప్రశ్నలడుగుతూనే ఉన్నారు. లెక్కల సారుగా, సోషల్ టీచర్ గా, తెలుగు మాస్టారుగా..ఇలా భిన్న విషయాలపై పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఎక్కాలు చెప్పమని, కాలాలు ఎన్ని అని, సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయని, బోర్డుపై పేర్లు రాయమని, ఇలా పలు రకాలుగా విద్యార్థులను ప్రశ్నించారు. అయితే మంత్రి హరీష్ అడిగిన అన్ని ప్రశ్నలకు విద్యార్థులు నీళ్లు నములుతూ సమాధానాలు చెప్పకపోవడంతో...తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చదివితే ఎలా పాస్ అవుతారంటూ విద్యార్థులను మందలించారు. ఆ తర్వాత విద్యార్థుల వెనకబాటుకు కారణమవుతున్న టీచర్లకు అక్కడే క్లాస్ తీసుకున్నారు.

విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకుంటేనే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నా విద్యార్థులు కనీసం చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలివ్వలేకపోవడం పై హరీష్ రావు టీచర్లను కూడా మందలించారు. విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో పరీక్షిస్తూ ఉండాలని సూచించారు.

Next Story