దేశానికి రోల్ మోడల్ తెలంగాణ

By రాణి  Published on  14 Dec 2019 10:37 AM GMT
దేశానికి రోల్ మోడల్ తెలంగాణ

కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రాష్ర్టంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ హయాంలో అయితే డెలివరీ చేసేందుకు ఆస్పత్రుల్లో డాక్టర్లే ఉండేవారు కాదన్నారు టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఆనాడు కరెంట్ లేక ఫ్యాక్టరీలు మూతపడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ ను కోతలు లేకుండా అందించామన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా రాష్ర్టమంతా తాగునీరందిస్తామన్నారు.

తెలంగాణలో చేపట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణలోని పథకాలను అమలు చేసే దిశగా కేంద్రం ఆలోచిస్తుందన్నారు. రాష్ర్టంలో మరింత అభివృద్ధి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కంది మండలాన్ని ఏర్పాటు చేశామని, రూ.80 కోట్ల వ్యయంతో కంది - శంకర్ పల్లి రోడ్డు వేస్తున్నామన్నారు. మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, త్వరలోనే మండలానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు.

Next Story