విడాకులు తీసుకోనున్న ఆసీస్‌ క్రికెటర్‌ మైకేల్‌ క్లార్క్

By Newsmeter.Network  Published on  13 Feb 2020 9:55 AM GMT
విడాకులు తీసుకోనున్న ఆసీస్‌ క్రికెటర్‌ మైకేల్‌ క్లార్క్

ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌.. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. 2012లో మాజీ మోడల్ కైలీని వివాహం చేసుకున్న మైకెల్ క్లార్క్.. పరస్పర అంగీకారంతో తాము దూరమవుతున్నట్లు వెల్లడించాడు. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉన్నారు.

ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ.. తమ కుమార్తెను ఇద్దరం చూసుకోవడానికి కట్టుబడి ఈ నిర్ణయానికి వచ్చామని క్లార్క్‌ దంపతులు చెప్పారు. అలాగే తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే క్లార్క్, కైలీ దంపతులు కోర్టు వెలుపలే తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 5 నెలల కిత్రం క్లార్క్‌ దంపతులు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కైలీ ఆ వార్తలను ఖండించారు. తమ బంధం బలంగా ఉందని తెలిపారు.

కెప్టెన్‌గా ఆస్ట్రేలియా టీమ్‌కి ఎన్నో మరుపురాని విజయాల్ని అందించిన క్లార్క్.. 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ క్లార్క్.. గత కొంతకాలంగా భార్యతో గొడవపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. గత ఏడాది అవి పతాక స్థాయికి చేరడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది.

Next Story