రిథమిక్ జిమ్నాస్టిక్స్ మేటి.. మన మేఘన
By Newsmeter.Network Published on 23 Jan 2020 3:52 PM GMTరిథమిక్ జిమ్నాస్టిక్స్ చాలా విలక్షణమైన క్రీడ. కేవలం శరీరాన్ని ధనుస్సులా వంచి, విన్యాసాలు చేస్తూనే సంతులనాన్ని కాపాడుకోవాలి. ఆ పనిని చేస్తూ చేస్తూనే చేతిలో రిబ్బన్లు, రింగుల వంటి వస్తువును ఆడించాలి. అదీ లయ తప్పకుండా. దీని తోడుగా వినిపించే సంగీతానికి లయబద్ధంగా నృత్యం చేయాలి. ఇలా నృత్యం, లయ, విన్యాసం, వ్యాయామాల విలక్షణ సంగమమే రిథమిక్ జిమ్నాస్టిక్స్. మన దేశంలో ఈ ఆటకు అంత ప్రాచుర్యం లేదు.
అయితే మనమ్మాయి మేఘనా రెడ్డి గుండ్లపల్లి జనవరి 18న ఇటలీలో జరిగిన అయిదవ మైత్రీ అంతర్జాతీయ క్రీడలలో రికార్డు పెర్ఫార్మెన్స్ తో తన టీమ్ “రొటీన్” కు స్వర్ణాన్ని సంపాదించి పెట్టింది. ఆమె సాధించిన స్కోరు ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించలేదు. దీనితో పాటూ హూప్స్ కేటగరీలో కాంస్యాన్ని కూడా సాధించింది.
లావణ్యం, నైపుణ్యం, విన్యాసం, వైవిధ్యాల మేలు కలయికగా ఆమె పెర్ఫార్మెస్న్ ప్రపంచం ప్రశంసలను పొందింది. ఈ తెలంగాణ బిడ్డ గత పదేళ్లుగా ఈ క్రీడను అభ్యసించింది.తమాషా ఏమిటంటే 2010 లో ఆమె ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో ప్రేక్షకురాలిగా ఈ ఆటను తిలకించింది. ఇప్పుడు ఆమె ఈ ఆటను తాను స్వయంగా ఆడటమే కాకుండా 2018 లో భారత్ తరఫున ఆస్ట్రేలియన్ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనగలిగింది.
ఇదేదో ఆషామాషీగా వచ్చింది కాదు. హైదరాబాద్ లో ఇల్లు. ఇటలీలో కోచింగ్. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ క్రీడ కూడా అల్లాటప్పా ఆట కాదు. శరీర దారుణ్యం, ఫ్లెక్సిబిలిటీ, విన్యాస వైఖరి అత్యద్భుతంగా ఉండాలి. రోజూ మూడున్నర కిలో మీటర్లు నడవాలి. జిమ్ లో గంటల పాటు అభ్యసించాలి. స్పెలా డ్రాగస్ అనే సుప్రసిద్ధ కోచ్ కింద శిక్షణ పొందాలి. ఇదంతా చేయాలంటే దృఢనిశ్చయం, కృతసంకల్పం ఉండాలి. ఇవన్నీ చాలవన్నట్లు ఈ ఆటలో రాణించాలంటే ప్రత్యేకమైన డైట్ ను ఫాలో కావాలి. తినాల్సిన వాటి కన్నా తినకూడనివి ఎక్కువ. నోరుకట్టుకుని బ్రతకాలి. గ్రాముల లెక్కన కొలుచుకుని తినాలి. మరో వైపు ఈ ఆటలో రాణించేందుకు కూచిపూడి శిక్షణ పొందాలి. అదీ శోభానాయుడువంటి వ్యక్తి వద్ద శిక్షణ పొందడమంటే మాటలు కావు. వీటికి తోడు వెంట పాఠ్య పుస్తకాలు. టైమ్ దొరికినప్పుడల్లా చదవాలి. ఎందులోనూ ఫెయిల్ కాకూడదు.
మేఘన దృష్టంతా ఇప్పుడు 2022 లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ పైన, 2024లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్ పైన ఉంది. ఈ ప్రయత్నంలో ఆమె తల్లిదండ్రులే ఆమెకు పెట్టని కోటలు. అందుకే తన విజయాన్ని ఆమె తన తండ్రికే అంకితం చేసింది.