అయిదు సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత మారియా షరపోవా.. టెన్నిస్‌కు గుడ్‌ బై చెప్పింది. అయిదు సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్ నెగ్గినా.. వరల్డ్ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించినా.. తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన 32ఏళ్ల ఈ రష్యా ముద్దుగుమ్మ తన రాకెట్‌ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది.

’20 ఏళ్ల ఆట, 5 గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. వేరే రంగంలో పోటీ పడి మరింత ఎత్తుకు ఎదిగే సత్తా నాలో ఇంకా ఉంది. నేను నా జీవితాన్ని టెన్నిస్‌కు ఇస్తే టెన్నిస్‌ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఎంతగా శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చని నేను నమ్మా. గతం గురించో, భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించకుండా వర్తమానంలో కష్టపడటం వల్లే ఈ విజయాలు దక్కాయనేది నా భావన. టెన్నిస్‌ కోర్టుకు సంబంధించి అన్ని జ్ఞాపకాలూ పదిలంగా నా మనసులో ఉంటాయి. అవి కోల్పోతున్న బాధ నాకూ ఉంది. టెన్నిస్‌ అనేది నాకు శిఖరంలాంటిది. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా ఒక్కసారిగా పైకి ఎక్కిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. ఇక ముందు కూడా జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని శ్రమిస్తా. మరిన్ని విజయాలు అందుకున్నా’ అని షరపోవా పేర్కొంది.

తండ్రి కోసం..

షరపోవా తండ్రి.. తన కూతుర్ని టెన్నిస్‌ ఛాంపియన్‌గా చూడాలనుకున్నాడు. రష్యాలో జన్మించిన ఆమె.. నాన్న కోసం రాకెట్‌ పట్టి ఆరేళ్ల వయసులోనే అమెరికాకు వచ్చింది. 13ఏళ్ల వయసులో అంతర్జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ టోర్నీలో విజేతగా నిలించింది. 15ఏళ్లకే తొలి డబ్ల్యూటీఏ టోర్నీ ఆడిన ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2004లో 17ఏళ్ల వయసులో ఆమె సంచలనం సృష్టించింది. రెండు సార్లు టైటిల్ గెలిచిన సెరెనాను ఫైనల్‌లో ఓడించి తొలిసారి వింబుల్డన్‌ టైటిల్‌ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత సంవత్సరమే ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఆటతో పాటు అందంతో అభిమానులను అలరించింది. ఓ దశలో ఆమెకు సాటి ఎవరూ లేరు అనేకునేంతగా విజయాలను సొంతం చేసుకుంది. అలాంటి తరుణంలో భుజం గాయం ఆమెను వేదించింది. దీంతో రెండేళ్ల పాటు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 2008 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గినప్పటికి తిరిగి భుజం గాయం వేధించింది. శస్త్రచికిత్స చేయించుకుంది. 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేసి.. తిరిగి నెంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకుంది. అయితే 2016లో డోపింగ్‌ కారణంగా 15 నెలల పాటు నిషేదానికి గురైంది. నిషేదం తరువాత తిరిగి కోర్టులో అడుగుపెట్టి డబ్ల్యాటీఏ టైటిల్ గెలిచి తనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. అయితే.. గాయాలు వేదించడంతో.. ఆమె లయ దెబ్బతింది. మొదటి రౌండ్‌లోనే ఓడిపోతుండడంతో.. చివరికి ఆటకే గుడ్‌ బై చెప్పింది.

షరపోవా కెరీర్‌లో..

గెలిచిన మ్యాచ్‌లు : 645
ఓడిన మ్యాచ్‌లు: 171
కెరీర్‌లో సాధించిన ప్రైజ్‌మనీ: 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు)
షరపోవా సాధించిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌: 5 (2004లో వింబుల్డన్‌; 2006లో యూఎస్‌ ఓపెన్‌; 2008లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్; 2012,2014లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌)
కెరీర్‌లో నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ సంఖ్య: 36
అత్యుత్తమ ర్యాంకింగ్‌ (ఆగస్టు 22, 2005): 1
నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగిన వారాలు: 21

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.