అయ్యో మృగరాజుకు ఎంత కష్టం వచ్చే..

By Newsmeter.Network  Published on  21 Jan 2020 4:53 PM GMT
అయ్యో మృగరాజుకు ఎంత కష్టం వచ్చే..

సింహాలు ఎక్కడ ఉన్నా సింహాలే.. అడవిలో ఉన్నా జూలో ఉన్నా సరే. ఒక్క సారి పంజా విసిరిందంటే ఇక అంతే సంగతులు. అడవిని శాసించే మృగరాజుకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలిస్తే హృదయం ద్రవించక మానదు. సింహం అనగానే దాని భీకర ఆకారంతో పాటు జూలు గుర్తుకు వస్తుంది. సూడాన్ రాజధాని కార్టూమ్‌లోని అల్ ఖురేషి పార్కులో సింహాలు పడుతున్న కష్టాలను చూస్తే అయ్యో అనక మానరు.

అల్ ఖురేషి పార్కులో ఐదు ఆఫ్రికన్ సింహాలు ఉన్నాయి. కొన్ని వారాలుగా అవి ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం అనారోగ్యంతో ఉంటే మందులు కూడా ఇవ్వడం లేదు. దీంతో అవన్నీ బక్కచిక్కిపోయాయి. ఎముకల గూడుతో దర్శనమిస్తున్నాయి. కొన్ని సింహాలకైతే ఎముకలు శరీరాన్ని చీల్చుకుని బయటకు వస్తున్నాయి. బలిష్టమైన దేహాంతో గాంభీర్యంగా గర్జించే సింహాలు సమయానికి ఆహారం దొరకకపోవడంతో అలా నీరసంగా మారడంతో ఆ పరిస్థితిలో మృగరాజులను చూడటం పర్యటకులను తీవ్రంగా కలిచి వేసింది.

ఆ దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభమే దీనికి కారణం. జంతువులకు అందించే ఆహారం, మందులకు కూడా నిధులు ఇవ్వలేక పోతున్నారట. దీంతో ఆ పార్కులో ఉన్న ఐదు సింహాలతో పాటు ఇతర జీవుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో తమ సొంత డబ్బులతో వాటికి ఆహారం అందిస్తున్నామని పార్కు మేనేజర్ ఎస్సామెల్డిన్ హజ్జర్ చెప్పారు.

కాగా ఉస్మాన్ సలీహ్ అనే వ్యక్తి వాటి పరిస్థితిని చూసి చలించిపోయాడు. వెంటనే ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేసి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫొటోలు చూసిన కొంతమంది నెటిజన్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Next Story