సావిత్రి అమ్మ స్వర్గంనుంచే నాపై ఆసీస్సులు కురిపించారు : కీర్తి సురేష్

By రాణి  Published on  27 Dec 2019 7:28 AM GMT
సావిత్రి అమ్మ స్వర్గంనుంచే నాపై ఆసీస్సులు కురిపించారు : కీర్తి సురేష్

ముఖ్యాంశాలు

  • మహానటి సినిమాలో నటించడం నా అదృష్టం
  • జాతీయ అవార్డ్ ని అందుకోవడం మధురానుభూతి
  • అవార్డ్ ని అందుకున్న క్షణంలో పట్టలేని సంతోషం
  • ఈ అవార్డుతో నాపై బాధ్యత మరింత పెరిగింది

ఆగస్ట్ 9, 2019న ప్రముఖ తెలుగునటి కీర్తి సురేష్ నిద్రలేవగానే ఒక మంచివార్త ఆమె చెవినపడింది. ఆ రోజున 66ల నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాబితా విడదలయ్యింది. మహానటి సినిమాకు బెస్ట్ యాక్టర్ గా తనకు జాతీయ అవార్డ్ వచ్చిందన్న వార్త తెలియగానే కీర్తి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది.

Mahanati Keerthi Suresh 2నాలుగు నెలలపాటు కీర్తికి జాతీయ అవార్డును సాధించినందుకు అభినందనలు వెల్తువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఆ అవార్డ్ ని చేతికి తీసుకుంటానా అని కీర్తి ఎంతో ఆశగా ఎదురుచూసింది. చివరికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్న క్షణంలో తనకు అంతులేని ఆనందం కలిగిందని, ఆ క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేననీ కీర్తి సురేష్ చెబుతోంది. అవార్డును అందుకునేందుకు వేదికమీదికి వెళ్లే సమయంలో తనకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. తన కుటుంబ సభ్యులు ఎంతో గర్వంగా తనను చూస్తుండగా ఆ ఆవార్డ్ ని స్వీకరించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అంటోంది కీర్తి.

వచ్చే ఏడాది మూడు భాషల్లో ఆరు సినిమాలతో కీర్తి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పట్లో అసలు విశ్రాంతి తీసుకునే ఆలోచన లేనేలేదంటోందీ ముద్దుగుమ్మ. మహానటి సావిత్రి పాత్రను పోషించిన తర్వాత తనకు నటనపట్ల బాధ్యత ఎంతగానో పెరిగిన అనుభూతి కలుగుతోందని చెబుతోందీ వెర్సటైల్ హీరోయిన్. మహానటి సినిమాలో తనకు మహానటి సావిత్రి పాత్రను పోషించే అవకాశం కలగడం నిజంగా అదృష్టమనీ, అప్పట్నుంచీ పూర్తిగా సావిత్రి అమ్మ ఆశీర్వాదం తనకు లభించినట్టుగా భావిస్తున్నాననీ కీర్తి అంటోంది. మహానటికి ఫిలింఫేర్ అవార్డ్ తో పాటుగా జాతీయ అవార్డునుకూడా అందుకోవడం తన సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా చేసిందని చెబుతోంది.

Keerthi Suresh2019 సంవత్సరం నా కెరీర్ లో మైలురాయి

2019 సంవత్సరం తన జీవితంలో మరపురాని ఇలాంటి ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిన సంవత్సరమనీ, జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరమనీ, తన కెరీర్ లో ఈ సంవత్సరం ఒక మైలురాయిగా నిలుస్తుందని కీర్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అసలు తనకు ఇంత చిన్నవయసులో జాతీయ అవార్డ్ దక్కుతుందన్న ఆలోచన కూడా కనీసం రాలేదనీ, ఇప్పటికీ దాన్ని తను నమ్మలేని నిజంగా భావిస్తున్నానని అంటోంది కీర్తి. హైదరాబాద్ లో రజనీకాంత్ సినిమా షూటింగ్ లో ఉన్న కారణంగా కీర్తి ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ కి హాజరు కాలేకపోయింది.

తను తీసుకున్న జాతీయ అవార్డును మహానటి సావిత్రికి అంకితమిస్తున్నాని ప్రకటించింది కీర్తి సురేష్. స్వర్గం నుంచి ఆమె ఎంతో సంతోషంగా తనను ఆశీర్వదిస్తున్న అనుభూతి కలుగుతోందని చెబుతోంది. తనకు ఈ అవార్డ్ రావడానికి ఎందరో కృషి చేశారని, ముఖ్యంగా మహానటి యూనిట్ మొత్తం పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేసినందువల్లే తనకు ఈ అరుదైన గౌరవం దక్కిందంనీ, పేరు ప్రతిష్ఠలు వచ్చాయనీ నమ్రతగా కృతజ్ఞతలు తెలుపుతోంది.

మొదట నాగ అశ్విన్ తనకు కథ చెప్పినప్పుడు అసలు తనా రోల్ కి న్యాయం చెయ్యగలనా అన్న సందేహం కలిగిందనీ, ఆ కారణంగా అసలు ఆ రోల్ చేయడానికి ఒప్పుకోలేదనీ అయితే నాగ్ పట్టుబట్టి కచ్చితంగా ఈ పాత్రకు న్యాయం చేయగలిగిన సత్తా తనకు ఉందన్న నమ్మకం కలిగించాడనీ, ఆ విధంగా ఆ మహానటి పాత్రను తెరపై పోషించే అదృష్టం కలిగిందనీ చెప్పింది కీర్తి. మహానటి సినిమాలో టైటిల్ రోల్ ని పోషించడానికి ముందు మహానటి సావిత్రి సినిమాలు విపరీతంగా చూశాననీ, పూర్తి స్థాయిలో ఆమె హావభావాలను, ముఖ కవళికల కదలికలను తనలో పొందుపరచుకునే ప్రయత్నం చేశాననీ, అందువల్లే అచ్చంగా సావిత్రిని తెరమీద ఆవిష్కరించే అవకాశం కలిగిందనీ, ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునే అదృష్టంకూడా కలిగిందని కీర్తి అంటోంది.

Next Story