అమీర్‌పేటలో రెచ్చిపోయిన కుక్కలు.. 50మంది విద్యార్థులకు గాయాలు

By Newsmeter.Network  Published on  21 Jan 2020 2:19 PM GMT
అమీర్‌పేటలో రెచ్చిపోయిన కుక్కలు.. 50మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌ లో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. అమీర్‌పేటలో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. ధరమ్‌కరమ్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు పిచ్చి కుక్కలను వెంబడించి ఓ కుక్కను చంపేశారు.

ప్రభుత్వ పాఠశాల నుంచి తిరిగి వస్తున్న విద్యార్థుల పైకి కుక్కలు దూసుకు వచ్చాయి. ఒక్కసారిగా అవి మీదకు రావడంతో వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో పిచ్చికుక్కలు వారిని కరుస్తూ, గోళ్లతో గాయపరిచాయి. ఈ ఘటనలో 50మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంత మందిపై ఒక్కసారిగా కుక్కులు దాడికి దిగడంతో కలకలం రేపింది.

చాలా రోజులుగా తమ ప్రాంతంలో కుక్కలు ఇబ్బందులు పెడుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపాలంటేనే భయం వేస్తోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

Next Story