కరోనా దెబ్బకు మూతపడిన కేసినోలు

By రాణి  Published on  5 Feb 2020 9:32 AM GMT
కరోనా దెబ్బకు మూతపడిన కేసినోలు

టెక్సాస్ : గ్యాంబ్లింగ్ అంటే గుర్తుకు వచ్చే మొదటి పేరు లాస్ వేగాస్.. ఆ తర్వాత చైనా లోని మకావ్ లో కూడా పెద్ద పెద్ద కేసినోలు ఉంటాయి. లాస్ వేగాస్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా కేసినోలు ఇక్కడ ఉంటాయి. అటువంటి కేసినోలు కూడా మూతపడనున్నాయి. అది కూడా దాదాపు 15 రోజుల పాటు. ఇంతకూ ఇలా మూత పడటానికి కారణం ఏమిటో తెలుసా..? కరోనా వైరస్..! విపరీతంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో మకావ్ లోని కేసినోలను కూడా మూసివేయనున్నారు. గ్యాంబ్లింగ్ రాజధానిలో ఉన్న వ్యాన్ రిసార్ట్స్, లాస్ వేగాస్ శాండ్స్ లాంటి బడా కేసినోలే కాకుండా లోకల్ గా ఉన్న కేసినో లను కూడా దాదాపు 15 రోజుల పాటూ మూసివేయనున్నారు. రోజుకు కొన్ని వందల, వేల కోట్లు చేతులు మారే ప్రాంతం కాస్త నిర్మానుష్యం కాబోతోంది. మకావ్ లో ఇప్పటికే పది మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో అక్కడి అధికారులు, కేసినో ఓనర్లు అప్రమత్తమవుతున్నారు. మకావ్ సిటీలోని అతిపెద్ద కేసినోలో గెలాక్సి కేసినో కూడా ఒకటి..అందులో పనిచేసే ఒక వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందుగానే కేసినో మూసివేస్తే బాగుంటుందని ఈ నిర్ణయానికి వచ్చారు. మకావ్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారులు చెబుతున్నారు.

కేసినోలు మూసివేయడం అన్నది చాలా కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. మకావ్ ప్రజల ఆరోగ్యాన్ని గుర్తు పెట్టుకుని ఈ పని చేస్తున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. మకావ్ లో పనిచేసే వాళ్ళు ఇప్పటికే మాస్కులు ప్రత్యేకమైన సూట్స్ వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. దీనిని ఓ హెచ్చరికలా భావించాలని అంటున్నారు. ఈ కెసినోల ద్వారా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంటుంది.. 15 రోజుల పాటూ కేసినోలను మూసివేసినా ఆ నష్టాలను భరిస్తామని ఓ ప్రభుత్వ అధికారి చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు మకావ్ లో సాధారణ ప్రజా రవాణా సర్వీస్ ను నిలిపివేశారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మకావ్ లో గ్యాంబ్లింగ్ కంపెనీల ద్వారా 36.5 బిలియన్ డాలర్ల రెవిన్యూ లభించింది. రెండు వారాల పాటూ కెసినోలను మూసి వేయడం ద్వారా 5-15 శాతం వరకూ ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

Next Story