'లవకుశ' నాగరాజు కన్నుమూత

By సుభాష్  Published on  7 Sep 2020 7:40 AM GMT
లవకుశ నాగరాజు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. 'లవకుశ' నాగరాజు (72) కన్నుమూశారు. లవకుశ సినిమా సీత రాములను కళ్లకు కట్టినట్లు ఈ సినిమా ఇప్పటికి చెక్కుచెదరనిది. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. వారు పెరిగి పెద్దవారైనప్పటికీ లవ, కుశలుగానే అందరి చేత మంచి గుర్తింపు పొందారు. అయితే ఆ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడు నాగరాజు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండు కలగలిపిన పాత్ర లవుడుది. ఈ సినిమాలో ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

కాగా, ఎన్టీ రామారావు రాముడిగా, అంజలీదేవి సీతమ్మగా నటించిన లవకుశ సినిమా 1963లో విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. సుబ్రహ్మణ్యం తెరపైకి రాకపోయినా.. నాగరాజు మాత్రం పలు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. భక్త రామదాసు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేశారు. నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఎ.వి. సుబ్బారావు కుమారుడే నాగరాజు. నాగరాజు సుమారు 300 సినిమాల్లో నటించారు. నాగరాజు మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.

Next Story