బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు..శ్రీభరత్ కు కేవీబీ నోటీసులు

By రాణి  Published on  7 Feb 2020 7:17 AM GMT
బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు..శ్రీభరత్ కు కేవీబీ నోటీసులు

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడైన శ్రీ భరత్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు పంపింది. హైదరాబాద్ లోని అబిడ్స్ కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి టెక్నో యూనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసం పట్టాభి రామారావు, లక్ష్మణరావు, ఇతర కుటుంబీకులు రుణం తీసుకున్నారని బ్యాంక్ పేర్కొంది. అయితే తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి ఇప్పటి వరకూ రూ.124 కోట్ల 39 లక్షల21,485.08 చెల్లించాలని బ్యాంక్ పంపిన నోటీసులో తెలిపింది. ఈ మొత్తాన్ని గత నెల 21వ తేదీలోపే చెల్లించాలని నోటీసులు పంపినా ఎటువంటి స్పందన లేకపోవడంతో..తీసుకున్న రుణం చెల్లించకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ కరూర్ వైశ్యా బ్యాంక్ మరో నోటీసును జారీ చేసింది. రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తి పత్రాలు విశాఖ జిల్లా గాజువాక, భీమిలి మండలాలకు చెందినవిగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా..శ్రీ భరత్ గతంలో కూడా ఆంధ్రా బ్యాంక్ నుంచి రుణం తీసుకుని చెల్లించలేదని, ఆ బ్యాంక్ కు కూడా భరత్ రూ.100 కోట్ల రుణం బకాయిపడినట్లుగా సమాచారం. కాగా..2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీభరత్ టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.

Next Story