'కుప్పం' ప్రజల కల నెర‌వేర్చిన జ‌గ‌న్‌..!

By రాణి  Published on  25 Jan 2020 1:00 PM GMT
కుప్పం ప్రజల కల నెర‌వేర్చిన జ‌గ‌న్‌..!

కుప్పం ప్రజలు ఎన్నాళ్లనుంచో కంటున్న కల నెరవేరింది. కుప్పంను గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ప్రకటిస్తూ, కుప్పం సహా పరిసరాల్లోని 7 పంచాయతీలను డీ నోటిఫై చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక కుప్పం ను మున్సిపాలిటీగా అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలింది. అలాగే కుప్పం మండలంలోని కుప్పం పంచాయతీతో పాటుగా ఆ చుట్టుపక్కలున్న చీలేపల్లె, దళవాయికొత్తపల్లె, చీమనాయని పల్లె, సామగుట్టపల్లె, తంబిగానిపల్లె, కమతమూరు, అనిమిగానిపల్లె పంచాయతీలను కలుపుకుంటూ...కుప్పంను మున్సిపాలిటీగా మార్చాలని గతంలోనే టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి..వాటిని ఆమోదించిన ప్రభుత్వం...మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖకు పంపింది. అక్కడున్న అధికారులు కుప్పంను మున్సిపాలిటీగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కోరారు.

అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ఆదేశాల మేరకు 8 పంచాయతీల్లో సభలు నిర్వహించి, మున్సిపాలిటీలో కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పంచాయతీలు ఇచ్చిన అంగీకార పత్రాలను పాలకమండళ్ల ద్వారా పంపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన కుప్పం మున్సిపాలిటీ ప్రతిపాదనకు ఇప్పుడున్న ప్రభుత్వం కుప్పంతో పాటు పరిసర పంచాయతీలను డీ నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో మొత్తం ప్రక్రియ అయిపోయింది గనుక ...ఇక మిగిలింది కుప్పంను గ్రేడ్ 3 మున్సిపాలిటీగా మార్చుతూ...ప్రకటన విడుదల చేయడమే. ప్రకటన విడుదలైతే కుప్పం మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేయాల్సి ఉంటుంది.

కుప్పంను మున్సిపాలిటీ చేయాల్సిందిగా గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన రాగా...ఇదేదో వైసీపీ వచ్చాకే జరిగిందన్నట్లుగా ఆ పార్టీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా..14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పంను పట్టించుకోకుండా...అమరావతిని సింగపూర్ చేస్తా...అని ప్రగల్భాలు పలికాడంటూ విమర్శలు చేస్తున్నారు.

Next Story