బిర్యానీ నగరంలో కుల్చాల కోట

By రాణి  Published on  28 Feb 2020 6:31 AM GMT
బిర్యానీ నగరంలో కుల్చాల కోట

చార్మినార్ గల్లీల్లో తిరుగాడుతూంటే నోరూరించే వాసనలు తెరలు తెరలుగా పొరలుకుంటూ వచ్చేస్తాయి..ఒకచో ఫిష్ వేపుళ్లు.. ఇంకొకచోట చికెన్ మటన్ ఫ్రైలు, మరొక చోట మాగుతున్న జిలేజీల వాసన.. ఇలా వాసనలు ముక్కుపుటాలను అదరగొట్టేస్తూంటాయి. కడుపులో గంట కొట్టిస్తూ ఉంటాయి. నాలుకలో లాలాజలం ఊరించేస్తూ ఉంటాయి. ఈ వాసనల మద్య మనదైన హైదరాబాదీ బిర్యానీ స్మెల్ అదరగొట్టేస్తూ ఉంటుంది. నిజం..మన హైదరాబాద్ కంచం చరిత్ర ఘనం. కంచంలో వడ్డించే పదార్థాల చరిత్ర ఘనం. వాటిని తిని లొట్టలేసే మన భోజన ప్రియుల చరిత్రా అంతే ఘనం. అందుకేనేమో హైదరాబాద్ కు ఇటీవలే యునెస్కో తరఫున క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ అవార్డు కూడా వచ్చింది.

అసలు హైదరాబాద్ చరిత్రే ఆహారంతో ముడిపడి ఉందన్న సంగతి మీకు తెలుసా? దక్షిణాదిలో రాజ్యాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఆశీర్వాదం కోసం అసఫ్ జాహ్ హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వద్దకు వెళ్లాడట. ఆయన అసఫ్ జాహ్ కు కుల్చాలు తినమని ఇచ్చాడట. అసఫ్ జాహ్ ఏడు కుల్చాలు తిన్నాడు. దాంతో నిజాముద్దీన్ నీ వంశం ఏడుతరాలు పరిపాలిస్తుంది పొమ్మని ఆశీర్వదించాడట. అలా ఏడు తరాల పాటు అసఫ్ జాహ్ లు ఏలుబడి సాగించారు. ఆహారం కథ అక్కడితో ఆగిపోలేదు. అసఫ్ జాహ్ తన రాజ్య ధ్వజంపై కుల్చాలను ముద్రించాడు. అయితే అది కుల్చా కాదని, అది అర్థచంద్రం అని చరిత్రకారులంటారు.

కుల్చాల ప్రస్తావన వస్తే అమృత్ సరీ కుల్చాలు అంటే అమృత్ సర్ లో దొరికే కుల్చాలకు పోటీ లేదు. అది తిన్న వారి నాలుక దాని కోసం తహతహలాడుతుంది. కడుపు ఇంకా కావాలి అని కొట్టుకుంటూంది. అందుకే అమృత్ సర్ లోని లారెన్స్ రోడ్, రంజిత్ అవెన్యూలలోని బెస్ట్ కుల్చాల టేస్టులు ఫస్టు ఫస్టుగా హైదరాబాద్ కు తెచ్చి మనమందరం సుష్టుగా భోంచేసేందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంజాబ్ నుంచి వలస వచ్చిన వారందరికి పాత రుచులు, కొత్త అనుభూతులు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాధాపూర్ లోని అల్లే ఇన్ లోని కుల్చా కల్చర్ ఇప్పుడు కుల్చాలను మనకు అందిస్తోంది. మనకి బిర్యానీ ఎలాంటిదో పంజాబీలకు అమృత్ సరియా కుల్చాలు అలాంటివి.

తమాషా ఏమిటంటే అక్కడనుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగం చేస్తున్న సజ్జన్ శర్మకి కుల్చాల మీద మనసుపోయింది. ఇక్కడేమో అవి దొరకవు. దాంతో ఆయన స్వయంగా కుల్చా కల్చర్ అనే హోటల్ ను పెట్టి అందరికీ కుల్చా రుచి చూపిస్తున్నాడు. ఇప్పుడీ హోటల్ హైదరాబాద్ లో పెద్ద హిట్టు. లోపల సుతి మెత్తగా, నోట్లోపెట్టగానే కరిగిపోయేలా, కాలిఫ్లవర్, ఆలూ, పనీర్ స్టఫింగ్ తో చోలే, చట్నీ సైడ్ డిష్ లతో నోరూరించే కుల్చాలు ఇక్కడి ప్రత్యేకత. రండి..మన నగరంలోనే ఉన్న పంజాబీ టేస్టుల బెస్టు భవనానికి వెళ్లిపోదాం. కడుపు నిండా తిందాం..

Next Story