ఉత్తమ్.. నువ్వు ఇంట్లో కూర్చొంటే మంచిది.. కేటీఆర్ ఫైర్
By Newsmeter.Network Published on 30 Jan 2020 12:12 PM GMT
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. డబ్బుతో గెలిచిందనడం సరికాదని, ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ అవమానిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్. రెండు మున్సిపాలిటీల్లో గెలిచి బీజేపీ ఎగిరెగిరి పడుతోందని, 92 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఛైర్ పర్సన్, మేయర్‌లు గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా తెరాసకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాలతో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయని చెప్పారు. 2018లో చంద్రబాబు, రాహుల్ ఒక్కటైనా 75 శాతం సీట్లు టీఆర్‌ఎస్ సాధించిందని గుర్తు చేశారు. పంచాయతీ, జడ్పీ మండల ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు సాధించగానే ప్రతిపక్ష నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం జడ్పీ స్థానాలు.. మున్సిపల్ ఎన్నికల్లో 130 స్థానాలకు 122 సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అందుకే ఎన్నికలు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి 8 వేల మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరు. బీజేపీ ఎగిరెగిరి పడింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని మిడిసిపడింది. కానీ వారు పూర్తిస్థాయిలో అభ్యర్థులను దింపలేకపోయారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడుతున్నారు.. ఆ మాటలు ఓట్లేసిన ప్రజలను అవమానపరచడమే. వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఉత్తమ్ అంటున్నారు. ఇక ఆయన ఇంట్లో కూర్చుంటే మంచిది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి చూపించాం. ప్రతిపక్షాల విమర్శలను మేం పట్టించుకోం.. మీరూ పట్టించుకోవదన్నారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన నేతలంతా అభివృద్ధిపైనే దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. గెలిచామనే అహంకారం తలకు ఎక్కించుకోవద్దని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో మున్సిపల్ చట్టంపై కొత్తగా ఎన్నికైనవారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. అవినీతికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు దూరంగా ఉండాలని, తప్పులు చేసి తలవంపులు తేవొద్దని సూచించారు. తప్పులు చేస్తే పదవులు ఊడుతాయని హెచ్చరించారు.