అచ్చు క్రికెటర్ శ్రీకాంత్ లాగా 'జీవించబోతున్న' జీవా

By Newsmeter.Network  Published on  14 Jan 2020 11:46 AM GMT
అచ్చు క్రికెటర్ శ్రీకాంత్ లాగా జీవించబోతున్న  జీవా

అతను రంగంలో ఓ ఫోటో జర్నలిస్టుగా 'చించేశాడు.' ఆ తరువాత 'త్రీ ఇడియట్స్'లో ఒకడుగా 'దంచేశాడు.' ఇప్పుడు రియల్ లైఫ్ లోనే చించేసే, దంచేసే క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వేషం కట్టబోతున్నాడు. హీరో జీవా ఇప్పుడు క్రికెటర్ శ్రీకాంత్ గా మెప్పించబోతున్నాడు. శ్రీకాంత్ నేటి తరం సెహ్వాగ్ లకు ఆదర్శం. ఆటాడుతూ శ్లోకాలు చదువుతూ, మధ్యమధ్యలో మెడలో గొలుసును కళ్లకద్దుకుంటూ, కాసింత అల్లరి, ఇంకొంత గడుసుదనం కలబోసిన శ్రీకాంత్ బయోపిక్ కోసం తయారవుతున్నాడు.

అయితే విశేషం ఏమిటంటే హీరో జీవాకు శ్రీకాంత్ అభిమాన ఆటగాడు. 1996లో స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూలు ప్రాజెక్టు వర్క్ కోసం జీవా శ్రీకాంత్ ను ఇంటర్ వ్యూ చేశాడు. అప్పడు జీవా ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఇప్పుడు అదే జీవా శ్రీకాంత్ బయోపిక్ చేస్తున్నాడు. అయితే జీవా అదృష్టం ఏమిటంటే జీవా అచ్చు శ్రీకాంత్ లాగానే ఉంటాడు. ఈ విషయం ఇటీవలే షూటింగ్ ను చూసేందుకు వచ్చిన సునీల్ గవాస్కర్ చెప్పారు. ఫేమస్ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్, వెస్టిండియన్ క్రికెటర్లు బ్రయాన్ లారా, గార్డన్ గ్రీనిడ్జ్ లు కూడా ఇదే మాట అన్నారు. పెద్దగా ప్రాస్తెటిక్ మేకప్ అవసరం లేకుండానే, చిన్న చిన్న హెయిర్ స్టయిల్ మార్పులతో జీవా అచ్చు శ్రీకాంత్ లా కనిపించబోతున్నారు.

జీవా ఎక్కువగా గల్లీ క్రికెటే ఆడేవాడు. గల్లీ క్రికెటర్లు ఫేమస్ క్రికెటర్ల నడక తీరు, బ్యాట్ పట్టుకునే పద్ధతి, స్టాన్స్ తీసుకునే స్టయిల్ వంటివి సులువుగానే పట్టేస్తారు. అలా శ్రీకాంత్ స్టయిల్ ను జీవా త్వరగానే పట్టేశాడు. కొద్దిగా బ్యాక్ లిఫ్ట్ లో తేడా ఉన్నా ఇప్పుడు శ్రీకాంత్ స్టయిల్ ను పూర్తిగా పట్టేశాడు. మాజీ క్రికెటర్ బల్వీందర్ సింగ్ సంధు, తన మిత్రుడు వినీత్ పద్మనాభన్ ల దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాడు. జీవా ముంబాయి వెళ్లలేని పరిస్థితి ఉంటే బల్వీందర్ ఏకంగా ముంబాయి నుంచి వచ్చి చెన్నైలో కోచింగ్ ఇస్తున్నాడట.

మొత్తానికి బయోపిక్ ల సీజన్ ఇది. ధోనీ, సచిన్ ల తరువాత ఇప్పుడు ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్, శ్రీకాంత్ ల బయోపిక్ లు కూడా వస్తున్నాయి.

Next Story
Share it