ఆమె పీఎస్‌కు వెళ్లకుండా కాకాణి ఇంటికి ఎందుకు వెళ్లింది..!- ఎమ్మెల్యే కోటంరెడ్డి
By Newsmeter.Network Published on 6 Oct 2019 8:03 PM ISTనెల్లూరు: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ అంతర్గత రాజకీయాలు రోడ్డుపై పడేలా మాట్లాడారు. ఒక పక్క జగన్‌ను గౌరవిస్తా అంటూనే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేశారు. తనను నమ్ముకున్నవారి కోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధమని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
వెంకటాచలం ఎం.పి.డి.వో సరళ తనపై అర్థంపర్ధంలేని ఆరోపణలతో పీఎస్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఎం.పి.డి.వో ఇంటిపై దాడి చేశానంటే పీఎస్‌కు వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని సీఎం జగన్ చెప్పారు. ఆయన మాటలను గౌరవిస్తున్నా . గత ప్రభుత్వంలో ఎమ్మార్వో, ఐపీఎస్‌లపై దాడులు చేస్తే రాజీ చేశారన్నారు. తమది నిజమైన ప్రభుత్వమని..వైఎస్ జగన్ సీఎంగా చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పారు కోటంరెడ్డి.
తనకు , జిల్లా ఎస్పీకి వ్యక్తిగత విభేదాలు ఉండటం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి . నాలుగు రోజుల క్రితం ఎస్పీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే..ఎస్పీ తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు కోటంరెడ్డి. అర్థరాత్రి తన ఇంటిపై, శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారన్నారు.
ఎం.పి.డి.వో సరళ పీఎస్‌కు వచ్చినప్పుడు కాకాణి అనుచరుడు ప్రదీప్ రెడ్డి పోలీసుల గురించి దారుణంగా మాట్లాడరని చెప్పారు కోటంరెడ్డి. స్టేషన్‌లో ప్రదీప్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
తమ బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో లే అవుట్ వేశాడు అని చెప్పారు కోటంరెడ్డి. లే అవుట్‌కు నుడా, రేరా అనుమతులు కూడా ఉన్నాయి. లే అవుట్‌కు కుళాయి కలెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా ఇవ్వలేదు. ఎం.పి.డి.వో సరళ 20 ఏళ్లుగా తనకు తెలుసు అన్నారు కోటంరెడ్డి. ఆమెకు ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ అడిగితే ..తమ ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని అన్నారని చెప్పారు అని తెలిపారు. నేను మా బావ కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగా..నీకు తెలియదు శ్రీదరా..ఇప్పుడు కుదరదు అన్నాడు. దీంతో సైలెంట్ అయిపోయానని కోటంరెడ్డి చెప్పారు.
జగనన్నా ఇక్కడ పక్షపాతంగా విచారణ జరిగింది. నా మీద, శ్రీకాంత్ రెడ్డి మీద కక్షపూరితంగా పోలీసులు వ్యవహరించారు ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఉన్నాయని నిగ్గు తేలిస్తే తనను సస్పెండ్ చేయమని సీఎం జగన్‌ను కోరారు కోటంరెడ్డి. ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే సరళకు క్షమాపణ చెబుతాన్నారు. సరళ తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.