రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ విఫలం : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని, రైతన్ననను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలోని కేతేపల్లి వ్యవసాయ సహాకార సంఘం ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన కేసీఆర్‌ వాటిని నెరవేర్చలేకపోయారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారని, పేద ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా.. సాయం చేశామని గుర్తు చేశారు. భువగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 9 మునిసిపాలిటీలు కాంగ్రెస్ గెలుస్తే.. అక్రమంగా మునిసిపల్ ఛైర్మెన్ లను గెలుచుకున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ పుణ్యమా అని ఉపాధి హామీ పథకం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారనీ, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కేతేపల్లిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్