అమరావతి ఒక మోసం అని, అసలైన అమరావతిని గత ప్రభుత్వం ఎండబెట్టిందని ఆరోపించారు మంత్రి కొడాలి నాని. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం పాలన వికేంద్రీకరణపై నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కొడాలి మాట్లాడుతూ..ఇది చంద్రబాబు అమరావతి అని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని అవ్వక ముందు నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి పథంలోనే ఉన్నాయని, రాజకీయంగా, సామాజికంగా, వ్యవసాయ పరంగా ఈ రెండు జిల్లాలు ముందున్నాయన్నారు. ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ వల్ల ఈ జిల్లాలకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.

చాలా రాష్ట్రాల్లో రాజధానులు రాష్ర్టం మధ్యలో లేవని కొడాలి నాని తెలిపారు. రాష్ర్టంపై చంద్రబాబుకు ఏ మాత్రం అవగాహన లేదని కొడాలి విమర్శించారు. రాష్ర్టం మధ్యలో ఉంటేనే రాజధాని అవుతుందా ? ఢిల్లీ దేశానికి మధ్యలో, చెన్నై, బెంగళూరు ఆయా రాష్ర్టాలకు మధ్యలో ఉన్నాయా ? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు వ్యక్తిగతంగా నష్టపోతామన్న భయంతోనే వికేంద్రీకరణకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాజధాని తరలింపు సామాజిక వర్గాల కొట్లాట కాదన్నారు. అమరావతి నుంచి రాజధానిని పూర్తిగా తరలించడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు.

రాజధాని కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడితే..మిగిలిన పథకాల సంగతేంటి అని కొడాలి ప్రశ్నించారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అని కొడాలి ప్రశ్నించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.