నేడు కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 22 Jun 2020 2:33 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల సాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందించనున్నారు. ఆదివారం కల్నల్ సంతోష్ ఇంటికి వెళ్లిన మంత్రి జగదీష్‌రెడ్డి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే సంతోష్‌బాబు కుటుంబానికి అందిస్తున్న రూ. 5 కోట్లు సాయం కాదని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్‌కు ఇస్తున్న గౌరవమని తెలిపారు. కాగా, వీరమరణం పొందిన సంతోష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇటీవల కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. రూ.5 కోట్లసాయంతోపాటు, హైదరాబాద్‌లో 800 చ.గజాల నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లేటర్‌ను కేసీఆర్ ఈ సందర్భంగా సంతోష్ భార్యకు అందించనున్నారు.
అలాగే భారత్-చైనా ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన 43 మంది సైనికులు కూడా మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నారు. అయితే అక్కడి సైనికులు ఎంత మంది చనిపోయారనేది చైనా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని, వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. అంతేకాకుండా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాల్సిన అవసరం ఉంది. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి అని అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తెలిపారు.