కత్రినా కైఫ్ వివాహ వేడుకలో అగ్రహీరోల సందడి..!
By రాణి Published on 24 Jan 2020 7:26 AM GMT
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా సిని పరిశ్రమకు చెందిన అగ్రహీరోల సమక్షంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా కత్రినా కి పెళ్లేంటి ? అనుకుంటున్నారా..ఇది నిజమైన పెళ్లి కాదు. కత్రినా ఒక బంగారు నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది కదా. అందులో భాగంగానే సినీ పరిశ్రమకు చెందిన అగ్రహీరోలను కూడా ఈ యాడ్ లో పెట్టి కత్రినాకు పెళ్లి చేసింది ఆ నగల దుకాణం. ఇదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ లుగా చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో వీరందరితో పాటు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా నటించారు.
యాడ్ కోసం చేసిన కత్రినా పెళ్లి బచ్చన్ దంపతులు కత్రినాకు తల్లిదండ్రులుగా పాత్రలు పోషించారు. ఇక పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, రాజ్ కుమార్ కనిపించారు. ఇలా యాడ్ షూటింగ్ చేసిన సందడిని తలచుకుంటూ..అమితాబ్ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. '' పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్రహీరోలు అక్కినేని నాగేశ్వరరావు, డా.రాజ్ కుమార్, శివాజీ గణేషన్ ల కుమారులైన నాగార్జున, శివ రాజ్ కుమార్, ప్రభులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని అమితాబ్ పేర్కొన్నారు. ఈ యాడ్ లో అమితాబ్, జయా బచ్చన్ లు డాన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
నాగార్జున తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో, శివరాజ్ కుమార్ కన్నడ సాంప్రదాయ దుస్తుల్లో, ప్రభు తమిళ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నిజంగా కత్రినాకు పెళ్లి జరుగుతున్నట్లే ఉన్న ఈ ఫొటోలు సినీ ప్రియులు ఒక లుక్ ఇచ్చేలా ఉన్నాయి.