అందరి దృష్టిలో నేను సింగిల్ పేరెంట్ నే..కానీ..
By రాణి Published on 7 Feb 2020 11:19 AM GMTబాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన ఇన్ స్టా ఖాతాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ ను షేర్ చేశారు. తన కవలలు రూహీ జోహార్, యష్ జోహార్ ల 3వ పుట్టినరోజు సందర్భంగా..బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కవలల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లలకు, తన తల్లి హీరూకు భావోద్వేగంగా లేఖ రాశారు.
‘అందరి దృష్టిలో నేను సింగల్ పేరెంట్‌ని.. అది నాకు కూడా తెలుసు.. కానీ వాస్తవానికి కాదు. ఎందుకంటే మా అమ్మ నా సింగిల్ పేరెంటింగ్ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తను నాకు మాత్రమే కాకుండా నా కవల పిల్లలకు కూడా తల్లిగా మారారు. ప్రతీ విషయంలో నాతో పాటు వారికి ఓ తల్లిగా ప్రేమ, ఆప్యాయత పంచుతారు. అదే విధంగా తన మద్దతు లేనిదే ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేను’ అని రాసుకొచ్చారు.
పిల్లలను ఉద్దేశిస్తూ..‘ రూహీ, యష్‌లు ఇంట్లో అడుగుపెట్టడంతో మా సంతోషం రెట్టింపు అయ్యింది. ఈ కవలల అల్లరి, ముద్దు ముద్దు మాటలు వింటుంటే రోజురోజుకు ఓ నూతన శక్తిని పొందుతున్న భావన కలుగుతుంది. నిజంగా వీరి రాకతో మా కుటుంబం సంపూర్ణమైంది. ఈ రోజుతో రూహీ, యష్‌లు 3వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు’ అని ఆనందం వ్యక్తం చేశారు.
44 ఏళ్ల బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన కరణ్ జోహార్ అసలు పేరు రాహుల్ కుమార్ జోహర్. ఇండస్ర్టీలోకి వచ్చాక ఆయన కరణ్ జోహార్ గానే పేరు తెచ్చుకున్నారు. 2017లో ఆయన సరోగసి ద్వారా ముంబైలోని మస్రాని ఆస్పత్రిలో కవలలకు తండ్రి అయ్యారు.