హ్యారీ పోటర్ ను రాసిన రైటర్.. భారతీయుడికి ఫోన్ చేసి..!

By Newsmeter.Network  Published on  16 Feb 2020 1:27 PM GMT
హ్యారీ పోటర్ ను రాసిన రైటర్.. భారతీయుడికి ఫోన్ చేసి..!

జె.కె.రౌలింగ్.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటీష్ రైటర్.. హ్యారీ పోటర్ ఆమె సృష్టే..! అటువంటి ఆమె తాను రాయబోయే నవలలో బెంగాల్ కు చెందిన ఓ యువకుడి పాత్రను చేర్చనుంది. ఇప్పుడు ఆ యువకుడి ఆనందానికి అవధులే లేవు.. మరి కొన్ని నెలల్లో అతడు రౌలింగ్ ను కలవడానికి క్యాలిఫోర్నియా వెళ్లనున్నాడు. అక్కడెక్కడో ఉన్న రౌలింగ్ కు ఈ యువకుడి గురించి ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారా..? దాని వెనుక కూడా చిన్న స్టోరీ ఉందండోయ్..!

వెస్ట్ బెంగాల్, పంపు బస్తీకి చెందిన నేత్రప్రసాద్ శర్మ.. పదవ తరగతితో చదువు ఆపేశాడు. ఆ తర్వాత బుక్సా టైగర్ రిజర్వ్ ఫారెస్టులో అతడు గైడ్ గా పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి రౌలింగ్ కొద్ది రోజుల కిందటే ఫోన్ లో మాట్లాడారు. టూర్ గైడ్ గా పనిచేస్తున్న నేత్ర ప్రసాద్ తో మాట్లాడుతూ తాను రాయబోయే నవలలో ముఖ్య పాత్రగా నీ జీవితాన్ని ఉంచబోతున్నానని తెలిపారు. ఫోన్ లో మాట్లాడిన తర్వాత 272 పేజీల డ్రాఫ్టును ఆమె నేత్ర ప్రసాద్ కు పంపించారు. అతడి జీవితం, చేస్తున్న పని గురించే కాకుండా మిగిలిన విషయాల గురించి మాట్లాడడానికి కాలిఫోర్నియా రావాలని పిలిచారు. ఆమె తనకు పాస్ పోర్టు రావడానికి.. వీసా అప్రూవ్ చేయడానికి సహాయం చేశారని.. జులై లో కాలిఫోర్నియాకు వెళ్లనున్నానని అతడు చెప్పాడు.

భారత్ నుండి కాలిఫోర్నియాకు అతడు వెళ్ళడానికి ముఖ్య కారణం.. ఆరుగురు అమెరికాకు చెందిన విద్యార్థులు సంవత్సరం కిందట టైగర్ రిజర్వ్ ను చూడడానికి వచ్చినప్పుడు నేత్ర ప్రసాద్ శర్మ వాళ్లకు టూర్ గైడ్ గా వ్యవహరించాడు. అలా వాళ్ళు వచ్చినప్పుడు జంతువుల గురించి నేత్ర ప్రసాద్ శర్మ ఎంతో అద్భుతంగా వివరించాడు.. జంతువులు ఎక్కడ ఉన్నాయో.. వాటి జాడను ఎలా కనుగొంటామో అన్నిటినీ నేత్ర ప్రసాద్ వారికి చెప్పాడు. ఆ విద్యార్థులు అతడిని దాదాపు అరగంట పాటూ ఇంటర్ వ్యూ కూడా చేశారు. కెమెరాలో రికార్డు అయిన ఆ ఇంటర్ వ్యూలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తాను ఉన్నత చదువులు చదువుకోలేకపోవడాన్ని.. ఆ తర్వాత జంతువుల మీద తనకు కలిగిన ప్రేమను.. టూరిస్ట్ గైడ్ గా మారిన విధానాన్ని వివరించాడు.

ఆ విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోగా.. నేత్ర ప్రసాద్ శర్మ తన ఉద్యోగంలో బిజీ అయిపోయాడు. కొద్దిరోజుల కిందట.. తనను ఇంటర్వ్యూ చేసిన విద్యార్థి బృందానికి చెందిన లారా నుండి ఫోన్ వచ్చిందని.. ఇదిగో జెకె.రోలింగ్ మీతో మాట్లాడుతారు అంటూ ఫోన్ ఇవ్వగానే.. ఆ విషయాన్ని తాను అసలు నమ్మలేకపోయానని అన్నాడు నేత్ర ప్రసాద్. ఆ విద్యార్థులు చేసిన ఇంటర్వ్యూ చూసాకనే రౌలింగ్ అతడి కేరెక్టర్ ను తన నవలలో ముఖ్య పాత్రగా మలిచింది.

Next Story