'బిజెపి'కి షాకిచ్చిన మిషన్ సోషల్ ఇంజినీరింగ్

By Newsmeter.Network  Published on  25 Dec 2019 1:36 PM GMT
బిజెపికి షాకిచ్చిన మిషన్ సోషల్ ఇంజినీరింగ్

ముఖ్యాంశాలు

  • సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ వల్ల బిజెపికి ప్రతికూలత
  • సమస్యను గుర్తించలేకపోయిన బిజెపి అధిష్ఠానం
  • ఈ ఎన్నికల్లో కనిపించని మోడీ వేవ్ ప్రభావం
  • స్థానిక అస్థిత్వానికే పట్టం కట్టిన ఓటర్లు
  • కేవలం హర్యానాలోమాత్రమే బిజెపికి అధికారం
  • మహారాష్ట్రలో, జార్ఖండ్ లో పార్టీకి చుక్కెదురు

హైదరాబాద్ : సోషల్ ఇంజినీరింగ్ పేరుతో జార్ఘండ్ లో ట్రైబల్ ప్రొఫైల్ ని మార్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బెడిసికొట్టాయి. తమ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థల్ని, ఓటర్ల మానసిక స్థితిని మార్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు అటుతిరిగీ ఇటు తిరిగీ నేరుగా వెనక్కొచ్చి ఆ పార్టీనే దెబ్బకొట్టాయి. ప్రత్యర్థి పార్టీలపై సంధించిన బాణాలు వెనక్కి తిరిగొచ్చి బిజెపి నేతలకే గుచ్చుకున్నాయి.

2014 తర్వాత బిజెపి తను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సోషల్ ఇంజినీరింగ్ పేరుతో సంస్కరణలు చేపట్టింది. గిరిజనులు బలంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రం కూడా వాటిలో ఒకటి. గిరిజన జాతుల్లో చర్చ్ పై అభిమానం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. బిజెపి వాళ్లకు మతపరమైన ధార్మిక అంశాలను బోధించడం మొదలుపెట్టింది. వాళ్లలో కొంతలో కొంతైనా మార్పు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.

తాజా ఫలితాలు బిజెపి ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు రుజువుచేశాయి. క్రైస్తవేతర, ముస్లిమేతర గిరిజనులకంటే హిందూ గిరిజనులకు గట్టి పట్టు చిక్కేలా చేయడం, వాళ్లదే పై చేయి అనిపించడం, ఇతరులను తిరిగి హిందూమతంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు లాంటివి గిరిజనులకు గిట్టలేదని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కేవలం 25 సీట్లే వచ్చాయి. 2014తో పోలిస్తే 12 సిట్టింగ్ సీట్లను బిజెపి నష్టంపోయిందీ ఎన్నికల్లో.

ఏడు దశాబ్దాల పోరాటం తర్వాత

జార్ఖండ్ లో మొత్తం సీట్ల సంఖ్య 80. 41 సీట్లొస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హత లభించినట్టే. ఏడు దశాబ్దాల పోరాటం తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. జార్ఖండ్ పోరాటానికి కౌంటర్ గా బిజెపి వనాంచల్ ని నిలబెట్టే ప్రయత్నాలు గట్టిగానే చేసిందని చెప్పొచ్చు. కానీ బిజెపి ఈ విషయంలో మాత్రం తన లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

చివరికి 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రులు గిరిజన జాతులనుంచే వచ్చారు. 2014లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బిజెపి సోషల్ ఇంజినీరింగ్ ప్రక్రియను ఈ రాష్ట్రంలో వేగవంతం చేసింది.

మోడీ చేసిన బలమైన క్యాంపెయిన్ దక్షిణాదిలో పనిచేసింనంతగా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది. మోడీ చాలా పొలిటికల్ స్లోగన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సామాజిక సమానత్వం అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు కొన్నిచోట్ల బాగానే వర్కవుటయ్యింది. కానీ జార్ఖండ్ లో మాత్రం సీన్ రివర్సయ్యింది. ఆ పార్టీపై కాస్తో కూస్తో అభిమానాన్ని పెంచుకుంటున్న గిరిపుత్రులు ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు.

గిరిజన సంఘాలు

గిరిజన జాతులకు చెందిన అబ్యర్థిని ముఖ్యమంత్రిగా ఫోకస్ చేయాల్సిన చోట బిజెపి తెలి జాతికి చెందిన రఘుబర్ దాస్ ని పెద్ద తలకాయగా అక్కడ నిలబెట్టింది. ఈయన ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. గిరిజన సంఘాలు దీన్ని మరో రకంగా తీసుకున్నాయి. మా దేశంలో పార్టీ ఏదైనా సరే మా మనిషే ముఖ్యమంత్రిగా ఉండాలితప్ప ఇతరుల్ని మేం ఆ స్థానంలో అంగీకరించబోయేది లేదంటూ గట్టి సమాధానమే ఇచ్చారు.

దీనిక ప్రధాన కారణం ఏంటంటే దాస్ ప్రభుత్వానికి స్థానిక గిరిజనుల సంక్షేమం గురించి అశ్రద్ధచేస్తోందన్న భావన వాళ్లకు కలగడమే. 2017లో దాస్ ప్రభుత్వం గిరిజనుల భూమి హక్కుకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. దానికి సంబంధించి ఛోటా నాగపూర్ టెనెన్సీ యాక్ట్ , సంతాల్ పరగణాల టెనెన్సీ యాక్ట్ బాగా ప్రభావం చూపించాయి. ఈ చట్టాలవల్ల గిరిజన భూముల్ని కమర్షియల్ గా వాడుకోవడానికి వీలు కలుగుతుంది.

జెఎమ్ఎమ్, కాంగ్రెస్ పార్టీలు ఈ విధానాన్ని నేరుగా తప్పుపట్టాయి. గిరిజనుల భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో సఫలమయ్యాయి. విపక్షాలనుంచి, స్థానిక గిరిజన సంఘాలనుంచీ విపరీతమైన ఒత్తిడి ఎదురుకావడంతో బిజెపి ప్రభుత్వం ఈ బిల్లుల్ని పక్కన పెట్టేయాల్సొచ్చింది.

గిరిజన జాతుల్ని మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం

2017లో వచ్చిన యాంటీ కన్వర్షన్ బిల్లుకూడా గిరిజనులను బిజెపికి దూరం చేసిందనే చెప్పాలి. ప్రభుత్వం గిరిజన జాతుల్ని మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్, జెఎమ్ఎమ్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

మోడీ వేవ్ తో ఉన్నతస్థానానికి చేరుకున్న బిజెపి ప్రభుత్వానికి ఈ కారణాలన్నీ కంటకంగా తయారయ్యాయి. ఉప ఎన్నికల్లోనే వాటి ప్రతికూల ప్రకంపనలు స్పష్టంగా బయటపడ్డాయి. డిసంబర్ 2015 నుంచి డిసెంబర్ 2019 మధ్య ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి వాటిలో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. గిరిజన జాతుల్లో పెల్లుబికుతున్న అసంతృప్తి స్థాయిని బిజెపి అంచనా వేయలేకపోయింది.

దాస్ ఆధ్వర్యంలోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించేస్తోందన్న భ్రమలోనే బిజెపి అధిష్ఠానం చివరివరకూ ఉందనే చెప్పాలి. దాస్ జెవిఎమ్ పేరుతో బాబులార్ మరాండీ ఆధ్వర్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలను జెఎమ్ఎమ్ నుంచి విడదీయడంలో విజయం సాధించారు. ఈ కారణంగా పార్టీపట్ల ప్రజల్లో విముఖత మరింతగా పెరిగింది.

సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్

తాజా ఫలితాలు సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ వల్ల జార్ఖండ్ లో బిజెపి ఎంత నష్టపోయిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బిజెపి మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మహారాష్ట్రలోకూడా ఓ రకంగా ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి తప్పలేదు.

అతంగా బలంగా లేని జాతుల్ని పైకెత్తడానికి అత్యుత్సాహం చూపించిన బిజెపి కోరి కొరివితో తలగోక్కున్న పరిస్థితిని ఏరికోరి తెచ్చుకున్నట్టయ్యింది. మహారాష్ట్రలో మరాఠాలను, హర్యానాలో జాట్లను, జార్ఖండ్ లో గిరిజనుల్ని విస్మరించడంవల్ల ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క హర్యానాలో మాత్రమే బిజెపి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అదికూడా స్థానిక పార్టీని కలుపుకోవడం వల్ల.

Next Story