ముఖ్యాంశాలు

  • మూడు రాజధానుల అంశంపై నాయకులతో పవన్ సమావేశం

  • రాజధాని వైపు వెళ్తారనే సమాచారంలో కార్యాలయం వద్ద పోలీసులు

  • జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది. రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా వైసీపీ సర్కార్‌ ముందుకెళ్తుండగా, ప్రతిపక్షాలు, అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఈ తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కీలక చర్చలు జరుపుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. దీంతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతానికి వెళ్తారన్న సమాచారంలో ముందస్తుగా పోలీసులు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. నెల రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా రాజధానుల అంశంలో ముందుకెళ్లడంపై పవన్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతం వైపు వెళితే తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు ఉండటం, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు ముందస్తుగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద మోహరించారు.

ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ పీఏసీ సమావేశం అనంతరం రాజధాని వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కార్యాలయం వద్దే అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటిస్తే తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల బలగాలు మోహరించడంతో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా మూడు రాజధానుల అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు. అలాగే రాజధాని రైతులు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన మూడు రాజధానుల అంశాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజధానుల అంశం ఉపసంహరించుకోకుండా రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.