కరోనా వచ్చిందని..జైలు పాలైన యువకుడు

By రాణి  Published on  12 Feb 2020 1:18 PM GMT
కరోనా వచ్చిందని..జైలు పాలైన యువకుడు

మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ముఖానికి మాస్క్ ధరించి..తనకు కరోనా సోకిందంటూ చిలిపి చేష్టలు చేసి ఆ రైలులో ఉన్న ప్రయాణికుల్ని ఆటపట్టించాడు. ఆ యువకుడు చేసిన చేష్టలకు రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన రష్యాలోని మాస్కో నగరంలో వెలుగు చూసింది.

తజికిస్థాన్ దేశానికి చెందిన కరోమాతుల్లో జాబోరోవ్ అనే యువకుడు రష్యా దేశంలోని మాస్కో నగరంలో మెట్రో రైలెక్కాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తనకు ఉన్నట్లు ప్రకటించడంతోపాటు ముఖానికి మాస్క్ ధరించి కింద పడిపోయి కొట్టుకుంటూ మెట్రోరైలులోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశాడు. కానీ..నిజానికి అతనికి కరోనా సోకలేదు. ఇది తెలియని ప్రయాణికులంతా అతడికి దూరంగా పరుగులు తీశారు. ఆఖరికి అదంతా ప్రాంక్ వీడియో తీయించి తన ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్ లలో షేర్ చేశాడు. అంతే..ఆ వీడియో అతని కొంపముంచింది. అటూ, ఇటూ చేరి అది కాస్తా పోలీసుల కంట పడింది. కరోనా పేరుతో ప్రయాణికులను భయపెట్టి పరుగులు తీయించిన చిలిపి యువకుడిని అరెస్ట్ చేసి అలెక్సీ కోర్టులో హాజరు పరిచారు.

కరోమాతుల్లో జాబోరోవ్ తరపు న్యాయవాది అతను ప్రయాణికుల్లో కరోనా పై అవగాహన పెంచేందుకే అలా చేశాడని వాదించినా ఫలితం దక్కలేదు. యువకుడు చేసిన పనికి ఆగ్రహించిన జడ్జి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు.

Next Story