సరిహద్దులను కాపాడేందుకు కఠినాతి కఠిన పరిస్థితుల్లో నిరంతరం శత్రువు తూటాను తప్పించుకునే యత్నంలో ఉన్న జవాన్లకు పెళ్లి సంబంధాలు వెతుక్కునే సమయం ఉంటుందా? శత్రు దాడులు, చొరబాట్ల ను కన్నార్పకుండా చూస్తూ, అడ్డుకునే జవాన్లకు, కళ్లార్పకుండా చూడాల్సిన బ్యూటీలు ఎక్కడ కనిపిస్తారు? అందుకే ఇలాంటి బ్రహ్మచారి సైనికులకు “పీపీపీ … డుండుండుం” అనుభూతిని ఇచ్చి, పెళ్లి చేసేందుకు అధికారులే నడుం కట్టారు.

ఇలాంటి వివాహం కాని జవాన్లు, యుద్ధం చేస్తూ భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న యువతులు, మహిళా సిబ్బంది సరిహద్దులను కాపాడే ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఐటీబీపీ ఒక మాట్రిమొనీ సైట్ ను ఏర్పాటు చేయబోతోంది. ఐటీబీపీలో 25,000 మంది అవివాహిత జవాన్లు, వెయ్యి మంది మహిళా సిపాయిలు ఉన్నారు. వీరి కోసం ఐటీబీపీ డిసెంబర్ 9 న ఒక పోర్టల్ ను ప్రారంభించింది. సాధారణంగా భార్య, భర్త ఒకే విభాగంలో పనిచేస్తే ఇద్దరికీ ఒకే చోటికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అలాంటి 330 జంటలు ఐటీబీపీలో ఉన్నాయి. ఇలా కలిసి పనిచేస్తే మానసిక ఒత్తిడులు ఉండవు. సిబ్బందికీ ప్రశాంతత, ఒంటరితనం నుంచి విముక్తి లభిస్తుంది కాబట్టి ఈ పోర్టల్ పెళ్లిళ్ల పేరయ్యగా మారిపోయింది. ఇప్పటికే 150 మంది ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఆలోచన వెనుక ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ దేస్వాల్ ఉన్నారు. ఆయన తన ఐటీ వింగ్ ను ఇలాంటి మాట్రిమోనియల్ ను రూపొందించాలని కోరాడు. ఇందులో పెళ్లికాని ప్రసాదులుగా ఉన్న ఐటీబీపీ సిబ్బంది వివరాలన్నిటినీ నమోదు చేయడం జరుగుతుంది. ర్యాంకు, సొంతూరు వివరాలు, ఇంటి సమాచారం, జవాను ఫోటోగ్రాఫులను అప్ లోడ్ చేస్తారు. దీనిని స్వయంగా ఐటీ టీమే అప్ లోడ్ చేస్తుంది. ఫలితంగా అబద్ధాలు నమోదు చేయడానికి వీలుండదు. ఒకరికొకరు లేదా అమ్మాయి, అబ్బాయిల కుటుంబాలకు నచ్చితే వారికి ముందు ఎస్ ఎం ఎస్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తరువాత మిగతా తంతు మొదలవుతుంది. ఈ ఇన్ హౌస్ మాట్రిమోనియల్ లో సమాచారం బహిర్గతం కాకుండా ఉంటుంది. అయితే సిబ్బంది ఇందులో తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోనవసరం లేదు. ఇష్టం ఉంటేనే నమోదు చేసుకోవచ్చు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.