గబ్బర్ ఔట్.. ఇషాంత్ డౌట్..!
By Newsmeter.Network Published on 21 Jan 2020 9:57 AM GMT
న్యూజిలాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు దూరం అవ్వగా పేసర్ ఇషాంత్ శర్మకూడా ఆడేది సందిగ్ధంలో పడింది. న్యూజిలాండ్ గడ్డపై ఈ నెల 24 నుంచి టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. దీంతో న్యూజిలాండ్ పర్యటనలో వీరి సేవలను భారత జట్టు కోల్పోనుంది.
గాయాలతో గబ్బర్ సావాసం..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి అధికారికంగా దూరమయ్యాడు. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కవర్స్ లో కొట్టిన బంతిని ఆపడానికి డ్రైవ్ చేశాడు. దీంతో అతని ఎడమ భుజానికి గాయమైంది. ఫిజియో వచ్చిన లాభం లేకపోవడంతో గబ్బర్ మైదానాన్ని వీడాడు. ఫీల్డింగ్ దూరంగా ఉన్న గబ్బర్ ఛేదన సమయంలో బ్యాటింగ్‌కి రాలేదు. మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకోగా ట్రోఫీ ప్రదానోత్సవ సమయంలో ధావన్ కట్టుతో కనిపించాడు.
ప్రపంచకప్ నుంచి గబ్బర్ ను గాయాలు వేధిస్తున్నాయి. చేతి వేలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్ ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతూ గాయపడ్డాడు.
ఆ టోర్నీలో ఫీల్డింగ్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైంది. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ శిఖర్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో అతని పక్కటెముకలకి గాయమైంది. వేగంగా కోలుకుని బెంగళూరు వన్డేకి ఫిట్‌నెస్ సాధించిన ధావన్ మళ్లీ గాయపడి న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకి దూరమయ్యాడు.
చీలమండల గాయంతో ఇషాంత్..
ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ ఇషాంత్ శర్మ చీలమండాలానికి గాయమైంది. విదర్భతో మ్యాచ్ సందర్భంగా విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్‌కు బౌలింగ్ చేసిన ఇషాంత్ వెనక్కి తిరిగి గట్టిగా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసే క్రమంలో పట్టు తప్పి పడిపోయాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో జట్టు సహాయక సిబ్బంది వచ్చి ఇషాంత్ ను గ్రౌండ్ బయటకు తీసుకువచ్చారు. ఇషాంత్ కాలు మడత పడిపోవడంతో గాయమైంది. వాపు చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గాయం తీవ్రంగానే కనిపిస్తుండటంతో ఇక మ్యాచ్‌లో కొనసాగించరాదని నిర్ణయించాం. అది ఫ్రాక్చర్ కాకూడదని కోరుకుంటున్నాం అని ఢిల్లీ జట్టు ప్రకటించింది.
ఇషాంత్ త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని, అయితే నిబంధనల ప్రకారం అతను జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి పునరావాస చికిత్స తీసుకోవాల్సిందేనన్నారు. ఆ తర్వాత రిటర్న్ టు ప్లే (ఆర్‌టీపీ) సర్టిఫికెట్ సమర్పిస్తేనే భారత జట్టు కోసం సెలక్టర్లు పరిశీలిస్తారు. ప్రస్తుతం టెస్టు ప్లేయర్ గానే ఇషాంత్ కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ కోలుకునేందుకు తగినంత సమయం ఉంది. అయితే అప్పటి వరకు ఇషాంత్ కోలుకుంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.
కాగా న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి ధావన్ దూరమవడంతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కనుందనే చర్చ మొదలైంది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ,శుభమన్ గిల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20, వన్డేల తర్వాత టెస్టులు కూడా ఉండనుండటంతో టెస్టు స్పెషలిస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కి ఎక్కువ అవకాశం ఉంది.