బేరాలొద్దమ్మా.. బేరాలాడితే.. ఇలాగే ఉంటాది..
By Newsmeter.Network Published on 7 Feb 2020 8:46 AM GMT
అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా ఫైనల్ కు చేరింది. టీమిండియా ప్రదర్శనను కొనియాడిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తమ జట్టు పై మాత్రం దుమ్మెత్తిపోశాడు. విజయాన్ని ఎలా సాధించాలో భారత జట్టును చూసి నేర్చుకోవాలని చురకలంటించాడు. ఇటీవల సెమీపైనల్ లో చిరకాల ప్రత్యర్థి పై యువభారత్ 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత యువ జట్టుకి పాక్ టీమ్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. పాక్ అండర్-19 జట్టుపై అలక్ష్యం వహిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై పెద్ద ఎత్తున ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
భారత్ అండర్-19 జట్టుకు రాహుల్ ద్రావిడ్ లాంటి అగ్రశేణి ఆటగాడు కోచింగ్ ఇస్తున్నాడు. అగ్రశేణి ఆటగాడి శిక్షణలో యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారు. ఒత్తిడి ఎలా అధిగమించాలో తెలుసుకుని.. సత్తా చాటుతూ భారత జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఇక అండర్-19 వరల్డ్‌కప్‌కు వెళ్లే పాక్ జట్టుకు ఆ స్థాయి వరకూ మాత్రమే ఆడిన క్రికెటర్లతో కోచింగ్ ఇప్పిస్తారా అంటూ ధ్వజమెత్తాడు షోయబ్ అక్తర్. పాకిస్తాన్‌లో ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉన్నా వారిని పట్టించుకోకుండా కింది స్థాయి కోచింగ్ ఇస్తే ఇలానే ఉంటుందంటూ ఎద్దేవా చేశాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సాయం అందించడానికి యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వంటి స్టార్ ఆటగాళ్లు ముందుకొచ్చినా వారి సేవలను వినియోగించుకొనేందుకు బోర్డు మాత్రం సుముఖంగా లేదు. పాక్ అండర్-19 జట్టుకి కోచ్‌గా ఉండేందుకు యూనిస్ ఖాన్ వస్తే ఏం చేశారు.. అతనికి జీతం ఇచ్చే విషయంలో పీసీబీ బేరాలకి దిగింది. అతను రూ.15 లక్షలు అడిగితే, మీరు రూ.13 లక్షలకే చేయమంటూ గీత గీసుకుని కూర్చుకున్నారు. ఓ సీనియర్ క్రికెటర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా అంటే ప్రశ్నించాడు. నాతో పాటు అండర్-19 టీమ్‌కి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మహ్మద్ యూసఫ్, యూనిష్ ఖాన్ తదితరులు రెడీగా ఉన్నారు. మా కోచింగ్‌లో టీమ్ శిక్షణ పొంది వరల్డ్‌కప్‌కి వెళ్లింటే ఈ తరహాలో పేలవ ప్రదర్శన కనబర్చేదా..?’ అని షోయబ్ అక్తర్ ప్రశ్నించాడు.
ఇక అక్తర్ వ్యాఖ్యాలను కొందరు సమర్ధించగా మరి కొందరు అక్తర్ పై మండిపడ్డారు. అక్తర్ బాధ పాక్ టీమ్ ఓడిపోయినందుకా.. అడినంత పేమంట్ ఇవ్వనందుకా అంటూ సెటైర్లు వేస్తున్నారు.