ఐపీఎల్ 2020 : ప్లే ఆఫ్స్‌, పైన‌ల్ మ్యాచ్ షెడ్యూల్ విడుద‌ల‌

By సుభాష్  Published on  26 Oct 2020 8:11 AM GMT
ఐపీఎల్ 2020 : ప్లే ఆఫ్స్‌, పైన‌ల్ మ్యాచ్ షెడ్యూల్ విడుద‌ల‌

ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రేసులో ఖ‌చ్చితంగా ఉంటుంద‌నుకున్న చెన్నై సూప‌ర్‌కింగ్స్ అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేర‌కుండానే ఇంటికి వెలుతున్న తొలి జ‌ట్టుగా నిలిచింది. ఉత్కంఠ మ్యాచులు, సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ల‌తో ఈ సీజ‌న్ అభిమానుల‌కు అ‌త్యంత వినోదాన్ని పంచుతోంది.

కాగా.. ఇప్పటి వ‌ర‌కు బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) కేవ‌లం లీగ్ ద‌శ వ‌ర‌కు మాత్ర‌మే షెడ్యూల్ ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 3తో లీగ్ ద‌శ మ్యాచ్‌లు ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది. నవంబర్‌ 4వ తేదీన విశ్రాంతి దినం. నవంబర్ ‌5న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరుగనుంది. దుబాయ్‌ వేదికగా ఈ క్వాలిఫయర్‌ మ్యాచ్ జరుగనుంది. ఎప్పటిలానే లీగ్‌ దశలోని పాయింట్ల పట్టికలో టాప్‌-1, టాప్‌-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరుగనుంది. గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది.

నవంబర్‌ 6వ తేదీన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ అబుదాబిలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-3, టాప్‌-4లో నిలిచిన జట్ల మధ్య ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుంది. నవంబర్‌ 7న విశ్రాంతి దినం. ఇక నవంబర్‌ 8వ తేదీన అబుదాబి వేదికగా క్వాలిఫయర్‌-2 మ్యాచ్ జరుగనుంది. ఈ క్వాలిఫయర్‌-2లో .. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెలుతుంది.

నవంబర్‌ 9వ తేదీన విశ్రాంతి దినం. ఇక ఐపీఎల్‌ 2020 ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా నవంబర్‌ 10న జరుగనుంది. క్వాలిఫయర్‌-1లో విజేత, క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు మధ్య ఫైనల్ జరుగుతుంది. దీంతో ఐపీఎల్ 2020 ముగుస్తుంది. ప్లేఆఫ్స్‌, ఫైనల్ మ్యాచ్‌లు అన్ని రాత్రి గం. 7.30ని.లకు ప్రారంభమవుతాయి. మహిళల టీ20 చాలెంజ్‌కు షార్జాను వేదికగా ఖరారు చేయడంతో.. ఇక్కడ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. ఈ లీగ్ నవంబర్ 4 నుండి 9వరకు జరుగుతుంది.

Next Story