చైనాలో ఉన్న 250 మంది భారతీయులు స్వదేశానికి రాక

By రాణి  Published on  28 Jan 2020 6:25 AM GMT
చైనాలో ఉన్న 250 మంది భారతీయులు స్వదేశానికి రాక

ముఖ్యాంశాలు

  • చైనాలో భారీ స్థాయిలో కరోనా వైరస్ విధ్వంసం
  • కరోనా దెబ్బకి అతలాకుతలమైన వూహాన్
  • అక్కడున్న 250మంది భారతీయ పౌరులు
  • వాళ్లని వెనక్కి భారత్ కి రప్పించేందుకు ఏర్పాట్లు
  • కేంద్ర ప్రధాన కార్యదర్శ ఆధ్వర్యంలో సమావేశం
  • చైనా ప్రభుత్వానికి విదేశీ వ్యవహారాల శాఖ విన్నపం
  • ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

చైనాలో కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం తారాస్థాయిలో ఉంది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ సంతతికి చెందినవారినందరినీ వెంటనే వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వూహాన్ లో ఉన్న 250మంది భారతీయ పౌరుల్ని తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల బృందం ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. మన దేశ పౌరుల్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చైనా ప్రభుత్వానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. అధికారులు అనుమతికోసం ఎదురుచూస్తున్నారు. వూహాన్ లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్ లో చైనానుంచి వచ్చిన ఐదుగురు భారతీయ పౌరులను నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ లో ఐసోలేటెడ్ వార్డ్ లో ఉంచి కరోనా వైరస్ ని గుర్తించే ప్రత్యేకమైన వైద్య పరీక్షలు చేయించారు. ఐదు రోజులుగా వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న వీరి రక్త నమూనాలను పుణేలోని ఇండియెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షకోసం పంపించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చిన రక్త పరీక్షల రిపోర్ట్ ల ప్రకారం అనుమానితులకు కరోనా వైరస్ లేదని తేలింది. స్థానికంగా సీజనల్ గా వచ్చే మామూలు జ్వరాలతోనే వారంతా బాధపడుతున్నట్టుగా వైద్యులు గుర్తించి వాళ్లని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. చైనాకి వెళ్లొచ్చిన ఈ ఐదుగురు పౌరులు తీవ్రస్థాయిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతుండగా వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు కరోనా వైరస్ టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో కరోనా నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక్కడిని వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు

చైనాలోని వూహాన్ లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా ఉన్నట్టుగా బయటపడటంతో వైద్యులు ప్రత్యేకంగా ఆ యువకుడి కుటుంబసభ్యులు ఐదుగురిని ప్రత్యేకంగా ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షలు జరిపించిన విషయం తెలిసిందే. వూహాన్ లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత వారి ద్వారా కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇక్కడికి రాగానే వెంటనే వారందర్నీ ఐసోలేటెడ్ వార్డులకు తరలించి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించాలని కేంద్రం నిర్ణయించింది. వాళ్లందరికీ కరోనా వైరస్ సోకలేదని నిర్ణారణ జరిగిన తర్వాతే పూర్తిగా 250 మందినీ వాళ్ల ఇళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కేవలం గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదని వైద్యులు అంటున్నారు. వీలైనంతవరకూ ముఖానికి మాస్క్ లు పెట్టుకోవడం, కట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకుండా ఉండడం లాంటి మినిమం జాగ్రత్తలు అవసరమంటున్నారు. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, గోడలమీద, ఇతరత్రా ప్రదేశాల్లో చేతుల్ని ఉంచకుండా చూసుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అందరూ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ కంటే అత్యంత ప్రమాదకరమైన కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు.

Next Story