మహిళల టీ20 వరల్డ్‌కప్‌ : ఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా

By Newsmeter.Network  Published on  5 March 2020 7:59 AM GMT
మహిళల టీ20 వరల్డ్‌కప్‌ : ఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలు మూడు సార్లు సెమీఫైనల్‌ వరకే పరిమితమైన భారత మహిళల జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో హర్మన్‌ప్రీత్‌ సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుత టోర్నీలో టీమ్‌ఇండియా గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో గ్రూప్‌-ఏ నుంచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్స్‌లో టీమ్‌ఇండియాతో ఇంగ్లాండ్‌ తలపడాల్సి వచ్చింది.

ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో మ్యాచ్‌ను నిర్వహించాలనే ప్రయత్నాలు సాగలేదు. ఈ వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేదు. రన్‌రేట్‌ పరంగా ఇంగ్లాండ్‌ (+2.291), భారత్‌(+0.097) కన్నా మెరుగ్గా ఉండడం గమనార్హం. ఇక పోతే రెండో సైమీఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇదే మైదానంలో జరగాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌ కూడా రద్దు అయితే.. టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో మెల్‌బోర్న్‌లో తుది పోరులో తలపడతాయి.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ రద్దు అయిన అనంతరం భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. 'వాతావరణం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం నిజంగా దురదృష్టకరం. దాంతో రూల్స్‌ ప్రకారం మేము ఫైనల్‌కు చేరాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే అనేది కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ ఆరంభమైన తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్‌లో మొత్తం మ్యాచ్‌లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ సెమీ ఫైనల్‌కు ఏమైన ఆటంకాలు వస్తే అప్పుడు గ్రూప్‌లో మ్యాచ్‌లను పరిగణిలోకి తీసుకుంటారని తెలుసు. మేము గ్రూప్‌-ఎలో టాపర్‌గా నిలవకుండా ఉండి, అదే సమయంలో సెమీ ఫైనల్‌ రద్దయితే అప్పుడు ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేది. మా జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలవడానికి సమష్టి ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరూ మంచి టచ్‌లో ఉన్నారు. షఫాలీ, స్మృతీ మంధానాలు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ అనేది కీలకం. ఒకసారి ఒత్తిడిలో పడ్డామంటే తిరిగి తేరుకోవడం​ కష్టం​. మేము నెట్స్‌లో కూడా సానుకూల ధోరణితోనే ప్రాక్టీస్‌ చేస్తున్నాం. నేను, మంధానాలు ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఇది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ మహిళలకు తొలి ఫైనల్‌. మా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటాం. వరల్డ్‌కప్‌ను గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తాం’ అని అన్నారు.

Next Story