మహిళల టీ20వరల్డ్ కప్‌ : టీమిండియా ఘన విజయం

By Newsmeter.Network  Published on  21 Feb 2020 12:07 PM GMT
మహిళల టీ20వరల్డ్ కప్‌ : టీమిండియా ఘన విజయం

మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. దీప్తి శర్మ(49నాటౌట్‌; 46 బంతుల్లో 3 పోర్లు) రాణిచడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు బరిలోకి దిగిన ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది.

133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. బెత్‌ మూనీ(6; 12బంతుల్లో) ఔటైనా మరో ఓపెనర్‌ అలిసా హీలి(51; 35 బంతుల్లో 6పోర్లు, 1సిక్సర్‌) దూకుడుగా ఆడింది. బౌండరీలతో విరుచుకుపడి అర్థశతకం సాధించింది. అలిసా జోరు చూస్తుంటే.. ఆసీస్‌ సునాయాసనంగా గెలిచేలా కనిపింది. కానీ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బంతిని గింగరాలు తిప్పుతూ ఆసీస్‌ బ్యాట్స్ ఉమెన్స్‌ ను పెలిలియన్‌కు పంపింది. పూనమ్‌ బంతులకు ఆసీస్‌ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. నాలుగు ఓవర్లు వేసిన పూనమ్‌ 19 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించింది. దీంతో ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో పూనమ్‌ నాలుగు వికెట్లతో రాణించగా.. శిఖ మూడు, రాజేశ్వరీ ఒక వికెట్‌ పడగొట్టారు.

అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభాన్ని అందిచారు ఓపెనర్లు షెఫాలి వర్మ(29, 15 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్సర్‌), స్మృతి మంధాన(10, 11బంతుల్లో 2 పోర్లు). వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో తొలి నాలుగు ఓవర్లలో 40/0తో నిలిచింది. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న తరుణంలో జోనాసెన్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌ అవుతుంది. ఇక ఏడో ఓవర్‌లో టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. జోనాసెన్‌ వేసిన ఏడో ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్‌ ప్రీత్‌(2; 5 బంతుల్లో) స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దీంతో 47/3తో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో నాలుగో వికెట్‌ 53 పరుగులు జోడించి రోడ్రిగ్స్‌(26; 33బంతుల్లో) దీప్తి శర్మల జోడి ఆదుకుంది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు సాధించింది.

Next Story