ఇండియన్ చేగువెరా జార్జి రెడ్డి..!

By Newsmeter.Network  Published on  9 Oct 2019 8:11 AM GMT
ఇండియన్ చేగువెరా జార్జి రెడ్డి..!

ఆయన ఆలోచనలే ఆయుధాలు. ఆయన మాటలే తూటాలు. ఆ నడవడికలో భవిష్యత్తుకు మార్గనిర్దేశనం ఉంది. విప్లవ పూలు పూస్తున్న కాలంలో ఎర్ర కోకిలై విప్లవాన్ని శ్వాసించి పాడాడు. ఉస్మానియా అక్షరాల జాబిలమ్మ ఒడిలో ఒదుగుతూ పెరిగాడు. ఆయనో యువ మేధావి. పుస్తక పఠనం అంటే ప్రాణం. తోటి వాళ్లకు సాయం చేయడమంటే ఇంకా ప్రాణం. ఉస్మానియాలో ఏ చెట్టును అడిగినా..ఏ రాయిని తట్టినా జార్జి రెడ్డిని గుర్తు చేసుకుంటాయి. లోలోనే కన్నీరు కార్చి విప్లవ వందనాలు వీరుడా..ఇండియన్‌ చేగువెరా అంటూ నినదిస్తాయి. జార్జిరెడ్డిని మట్టుపెట్ట వచ్చు..ఆయన ఆశయాల్ని మట్టుపెట్టలేరు. చరిత్ర ఎప్పటికీ చనిపోదు. అందుకే..వెండి తెరపై విప్లవ శంఖారావమై వస్తున్నాడు జార్జిరెడ్డి.

నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే తెచ్చుకున్నాడు జార్జిరెడ్డి. వయసుకు మించి సమాజాన్ని చదివాడు. నిజాంను ఎదిరించిన గడ్డపై పెట్టుబడిదారి వ్యవస్థను ఎదిరించాలని మనసులో ప్రమాణం చేసుకున్నవాడు జార్జిరెడ్డి. పెట్టుబడిదారి వ్యవస్థ వలన కలిగే చెడు ఫలితాలను జార్జిరెడ్డి 1960ల్లోనే ఊహించాడు. పెట్టుబడిదారి వ్యవస్థలో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతాయని జార్జిరెడ్డి బలంగా నమ్మాడు. సమాజంలో అంతరాలు తొలగిపోవాలి కాని..పెరగడమేంటీ? పెరగడానికి కారణమేంటీ? మనుషులు మధ్య అంతరాలు పెంచే వ్యవస్థ ఎందుకు అని తనలోతాను ప్రశ్నించుకునేవాడు జార్జి రెడ్డి. ఒంటరిగా ఉండేవాడు..కలిసిమెలిసి ఉండేవాడు. ఒంటరిగా మాట్లాడుకునేవాడు..అందరితో కలిసి పాటలు పాడే వాడు. ఆయన ఒక్కడు..అలానే అందరివాడు. జార్జిరెడ్డి ఒక శక్తికాదు..ఒక యుక్తి..ఒక శక్తి.

పోరాటమంటే జార్జిరెడ్డి దృష్టిలో సమాజంలో వచ్చే చైతన్యం. ప్రశ్నించడమంటే జార్జిరెడ్డి దృష్టిలో హక్కుల కోసం నినదించడం. పోరాటం - న్యాయం- సమానత్వం -హక్కులు కలిస్తే జార్జిరెడ్డి. తన నాయకత్వ లక్షణాలతో ఉస్మానియాకు ప్రశ్నించే గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. జార్జిరెడ్డి ఎక్కడుంటే అక్కడ వందల మంది విద్యార్ధులు. ఆ యువనేత ఎక్కడుంటే అక్కడ చర్చాగోష్టులు. చైతన్య ప్రవాహాన్ని హైదరాబాద్‌ నడిబొడ్డుపై సృష్టించినవాడు జార్జి రెడ్డి.

జార్జి రెడ్డి చదివింది న్యూక్లియర్ ఫిజిక్స్. ఆ సబ్జక్ట్ లో ఎంత శక్తి ఉందో..అంతకంటే శక్తిమంతంగా ఆలోచించేవాడు జార్జిరెడ్డి.ప్రజాస్వామ్యవ్యవస్థను గౌరవిస్తూనే రాజ్యాంగంలోని లోపాలను ధైర్యంగా ఎత్తిచూపేవాడు. ధనిక,పేద మధ్య తారతమ్యాలు అసలు నచ్చలేదు. ఈ అంతరాలు తగ్గించే దిశగా జార్జిరెడ్డి ఆలోచనలు సాగేవి. ఒక్కో విద్యార్ధి ఒక్కో బుల్లెట్ అవ్వాలని పిలుపునిచ్చాడు. పీడీఎస్‌యూని స్థాపించి విప్లవ ప్రవాహాన్ని వరదలా పారించాడు జార్జిరెడ్డి.

ఆనాటి ఉస్మానియా విద్యార్దులకు జార్జిరెడ్డి ఓ వేగుచుక్క. తుపాకి పట్టని విప్లవకారుడు. అడవి బాట పట్టని విప్లవ మేధావి. బుల్లెట్ స్పీడ్‌ కంటే వేగంగా ఆలోచించే చురుకుదనం. ప్రజాస్వామ్యం + విప్లవం కలగలసిన వ్యవస్థను నిర్మించే దిశగా జార్జిరెడ్డి ఆలోచనలు సాగేవి. అందుకే..విద్యార్ధిలోకానికి ఆనాడు జార్జిరెడ్డి హీరో అయ్యాడు. విద్యార్ధులకు, నవసమాజసం కోసం కలలు కనేవారికి హీరో అయితే..కొంత మందికి మాత్రం చేదు గుళిక అయ్యాడు. ఇక్కడే జార్జిరెడ్డిని లేకుండా చేయాలనే ఆలోచనకు బీజం పడింది.

భారత దేశానికి 8 నెలల్లో ఇండిపెండెన్స్ వస్తుందనగా అంటే..జనవరి 15, 1947న అమ్మ కడుపు నుంచి బయటకొచ్చాడు జార్జిరెడ్డి. అమ్మ కడుపులోనే ఉండగానే అసమానతలు గురించి విన్నట్లుంది..చిన్నప్పటి నుంచే వాటిపై పోరాటం చేశాడు. కేరళలోని పాలక్కడ్‌లో రఘునాధరెడ్డి, లీలా వర్గీస్ దంపతులకు జార్జి రెడ్డి జన్మించాడు. మంచి విద్యావేత్తల కుటుంబం. అప్పట్లోనే జార్జి రెడ్డి అమ్మ డిగ్రీలో రసాయన శాస్త్రం చేసి, ఎంఏ కూడా పూర్తి చేసింది. తండ్రి రఘునాథ రెడ్డి బీఏ హానర్స్‌ చేశారు. తల్లిదండ్రుల ఇద్దరి ప్రభావం జార్జిరెడ్డిపై ఉంది. జార్జి రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నై, బెంగళూరుల్లో సాగింది. పీయూసీ అంటే నేడు ఇంటర్మీడియట్‌తో సమానం నిజాం కాళాశాలలో పూర్తి చేశాడు. ఈ కళాశాలలోనే బీఎస్సీ (1964-67)పూర్తైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఏం.ఎస్సీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ.. కొన్ని నెలల పాటు ఏ.వి.కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా కూడా పనిచేశారు. జార్జి రెడ్డి బాక్సింగ్ చేసేవాడు. చిన్నప్పటి నుంచే జార్జి రెడ్డి పుస్తకాల పురుగు. ఈ పుస్తక పఠనం, సమాజం, రాజకీయాల్లో వస్తున్న మార్పులు జార్జి రెడ్డిని జార్జిరెడ్డిని ఆలోచనల సుడిగుండంలో తిప్పేవి.

జార్జి తొలుత కాంగ్రెస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రేస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథావైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్‌లు కాంగ్రెస్‌ పార్టీలో యువబృందంగా అవతరించారు. ఫ్యూడల్ భూస్వాముల వ్యతిరేక నినాదాలు జార్జిరెడ్డిని ఆకర్షించాయి. వారు "సోషలిస్టు స్టడీ ఫోరం"గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు కె. శ్రీనాథ్ రెడ్డి తండ్రి.. కేంద్ర మంత్రి కె.వి.రఘునాథరెడ్డి ప్రోద్భలంతో యూత్ కాంగ్రెస్‌లో చేరాడు. కాని..నిజం నిప్పులాంటిది. ముసుగు ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోవాల్సిందే. పెట్టుబడిదారి వ్యవస్థను కొత్త ముసుగుతో కాంగ్రెస్‌ను పరిరక్షించే ఎత్తుగడగా త్వరగానే జార్జి అర్దం చేసుకున్నాడు. ఇక..కాంగ్రెస్‌ కుహానా రాజకీయాలపై భ్రమలు వీడి విప్లవ పంథాను అనుసరించాడు.

ఇదే కొంత మందికి కంటగింపైంది. జార్జి రెడ్డి విప్లవ బాటలో చాలా మంది నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అనేక మందికి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. అందుకే పక్కా స్కెచ్ వేశారు. జార్జిరెడ్డిని చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు జులై 14, 1972 . జార్జి రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తున్నాడు. ఒంటరిగా నడుస్తున్నాడు. భవిష్యత్తు భారతం గురించి తనలో తాను కలలు కంటూ నడుస్తున్నాడు. కాని..జార్జి రెడ్డి శత్రువులు వెనకాలే మాటేసి ఉన్నారు. ఆ మతోన్మాదులు భవిష్యత్తుపై హీరోపై , యువనాయకుడిపై కత్తులతో దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు పొడిచారు. చనిపోయాడని అనుకున్నంత తరువాతనే ఆ మూకలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఓ భవిష్యత్తు దీపం ఆరిపోయింది.

భరతమాత ముద్దు బిడ్డ మట్టిలో కలిసిపోయాడు.

చరిత్రకు చావు ఉండదని ముందే చెప్పాను. అందుకే చరిత్ర మళ్లీ జార్జి రెడ్డికి ప్రాణం పోస్తుంది. ఆయన ఆలోచనలు నేటి తరానికి తెలియడానికి చరిత్ర కథగా మన ముందుకు వస్తుంది. జార్జిరెడ్డి బతికి ఉంటే ఇండియాకు ఫిజిక్స్‌లో నోబెల్ కూడా తెచ్చేవాడని అంటుంటారు. ఆ మేధావి ఆలోచనలు పూలై వికసించడానికి మళ్లీ వస్తున్నాడు. జార్జిరెడ్డిని మన మనుషులు చంపారు..కాని ఆయన ఆశయాలను, లక్ష్యాలను చరిత్ర చనిపోనివ్వదు. అందుకే వెండి తెర మీద విప్లవ పూలు పూయించడానికి వస్తున్నాడు జార్జి రెడ్డి. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఓ జార్జిరెడ్డి నీవు మట్టిలో కలిసినా కోట్ల మంది మనసుల్లో నిలిచిపోయావు. ఎందుకంటే..నీ ఆశయం నీది కాదు..సమాజం కోసం. ఓ వీరుడా నీకు విప్లవ వందనాలు.

వై.వి. రెడ్డి, న్యూస్ ఎడిటర్

Next Story