ఇంకా 39 పరుగుల దూరంలో..

By Newsmeter.Network  Published on  23 Feb 2020 7:26 AM GMT
ఇంకా 39 పరుగుల దూరంలో..

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోర్‌ కన్నా ఇంకా 39 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో అజింక్యా రహానే (25 బ్యాటింగ్‌; 67 బంతుల్లో 4 పోర్లు), తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి (15 బ్యాటింగ్‌; 70బంతుల్లో 2 పోర్లు) ఉన్నారు.

మయాంక్‌ అర్థశతకం..

183 లోటులో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ పృథ్వీ షా(14; 30బంతుల్లో 2 పోర్లు) జట్టు స్కోర్‌ 27 పరుగుల వద్ద ఔటైయ్యాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (58; 99 బంతుల్లో 7పోర్లు, 1 సిక్స్‌)తో జత కలిసిన నయావాల్ పుజారా(11; 81బంతుల్లో) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఓ వైపు పుజారా క్రీజులో పాతుకుపోగా.. మయాంక్‌ ఎడా పెడా బౌండరీలు బాదుతూ.. అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. పుజారాను బౌల్ట్, మయాంక్‌ ను సౌతీ బోల్తా కొట్టించాడు. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ(19; 43బంతుల్లో 3 పోర్లు) కూడా బౌల్ట్ బోల్తా కొట్టించడంతో టీమిండియా 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో వైస్ కెప్టెన్‌ అజింక్యా రహానేతో జతకలిసిన తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరు అభేద్యమైన ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. దీంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అంతక ముందు న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Next Story