ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్‌-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లోనూ భారత మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ స్టేజ్‌లో ఓటమే లేకుండా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించిన భారత్ జట్టు.. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను ఓడించి సెమీస్ చేరింది. శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లోనూ అదేజోరుని కొనసాగించింది.

ముందుగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేశారు. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు రాణించడంతో లంక ఆ మాత్రం సోరైనా సాధించింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ రాధా యాదవ్‌ నాలుగు వికెట్లు సాధించగా, మరో స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, శిఖా పాండేలకు తలో వికెట్‌ దక్కింది.

114 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి ఓపెనర్లు మంధాన (17; 12 బంతుల్లో 3పోర్లు), షపాలి వర్మ (47; 37 బంతుల్లో 7పోర్లు, 1సిక్స్‌) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (15; 14 బంతుల్లో 2పోర్లు, 1సిక్స్‌), జెమీమా (15 నాటౌట్: 15 బంతుల్లో 1పోర్‌), దీప్తి శర్మ (15 నాటౌట్: 13 బంతుల్లో 2పోర్లు) కూడా దూకుడుగా ఆడారు. దీంతో.. కేవలం 14.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.