అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా టీ20 ర్యాకింగ్స్ విడుద‌ల చేసింది. టాప్-10లో ఇద్ద‌రే భార‌త ఆట‌గాళ్లు చోటు ద‌క్కించుకున్నారు. ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి.. ప‌దో స్థానానికి ప‌డిపోగా.. రాహుల్ మాత్రం త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం కెరీర్ అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్.. ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విశేషంగా రాణించ‌డంతో.. 823 రేటింగ్‌ పాయింట్లతో త‌న రెండో స్థానాన్ని ప‌దిలంగా ఉంచుకున్నాడు. అదే సిరీస్‌లో విఫ‌ల‌మైన కోహ్లి.. 673 పాయింట్లతో మాత్రం 9వ స్థానం నుంచి 10వ స్థానానికి ప‌డిపోయాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 662 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టాడు. పాకిస్థాన్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 897 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండ‌గా.. ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ మూడో స్థానంలో నిలిచాడు.

ఇక టీ20 బౌలింగ్, ఆల్‌‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కనీసం ఒక్క భారత క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీలు వరుసగా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 630 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 567 పాయింట్లతో 20వ ర్యాంక్‌తో కొన‌సాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నాల్గో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో పాకిస్తాన్‌ తొలి స్థానంలో ఉండగా, ఆసీస్‌ రెండో స్థానంలో ఉంది.

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.