రోగాలను నయం చేసే రాగాల సరి కొత్త థెరపీ

By రాణి  Published on  23 Dec 2019 8:51 AM GMT
రోగాలను నయం చేసే రాగాల సరి కొత్త థెరపీ

ముఖ్యాంశాలు

  • ఐ డోసెస్ పేరుతో వివిధ రకాల ఫ్రీక్వెన్సీల్లో శబ్ద తరంగాలు
  • వివిధ సందర్భాలకు అనుగుణంగా ఆడియోలు, వీడియోలు
  • మెదడుకు శబ్ద తరంగాలకు స్పందించే, ఉత్తేజితమయ్యే శక్తి
  • విస్తృత స్థాయిలో పాపులర్ అవుతున్న కొత్త కాన్సెప్ట్

రాగాలు రోగాలను నయం చేస్తాయా. అవుననే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. కమ్మని సంగీతం చెవులకు వినపడుతుంటే ఆ సంగీతాన్ని వింటూ మైమరచిపోనివారంటూ ఎవరూ ఉండరు. సరదాగా కాస్త అలా అలా వినే మనసుకు నచ్చిన నాలుగు పాటలు మీ మెదడులో అద్భుతాలను సృష్టించి అనంతమైన మార్పుల్ని తీసుకురాగలుగుతుంది. గతంలో మ్యూజిక్ థెరపీ పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. డిజిటల్ డ్రగ్స్ పేరుతో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. అవును మీరు విన్నది, చూసింది, చదివిందీ నిజమే. డిజిటల్ డ్రగ్స్. ఇవికూడా ఎంచక్కా మామూలు మందుల్లాగే పనిచేస్తాయి. కానీ భౌతికంగా గోలీలను మింగాల్సిన అవసరం లేదు. చెవిలో ఓ హెడ్ ఫోన్ పెట్టేసుకుని ఓ డిజిటల్ డ్రగ్ ని వేసేసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అంటే డిజిటల్ ట్యూన్ ని వినడం అన్నమాట. ఆ డిజిటల్ వేవ్స్ మెల్లగా మీ మెదడును తాకి కావాల్సిన, రావాల్సిన మార్పులను క్రమక్రమంగా తీసుకొచ్చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఐ డోసర్ అనే పేరుతో ఇప్పుడీ శబ్దతరంగాలు, వాద్య సంగీతం, ఇంకా అనేకరకాలైన ఇతర రూపాలకు సంబంధించిన వేలాది ట్రాక్ లు ఆన్ లైన్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఇవి మెదడును ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అధ్యయనాల్లో స్పష్టంగా కనుగొన్నారు. వందలు, వేలు, లక్షల్లో వీటికి అభిమానులు పెరిగిపోతున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, పర్సనల్ అకౌంట్స్ ఇంకా వివిధ మార్గాల్లో ఈ బైనారియల్ బ్రెయిన్ వేవ్ ధీమ్స్ విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. మానసిక రోగాలకు ఈ థెరపీలు చాలా బాగా పనిచేస్తాయని మానసిక వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. శబ్ద తరంగాలకు స్పందించే శక్తి మెదడుకు బాగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని ఆధారం చేసుకుని వివిధ ఫ్రీక్వెన్సీలలో వివిధ రకాలైన ఆడియోలను ఈ సంస్థ ఆన్ లైన్ అందుబాటులో ఉంచుతోంది. వివిధ సందర్భాలకు సూటయ్యేలా వైవిధ్యభరితమైన ట్రాక్ లను సిద్ధం చేసింది. రోజురోజుకూ ఈ సంస్థకు పెరుగుతున్న పాపులారిటీని, డిమాండ్ ను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ ద్వారా మానసిక ఉల్లాసం

కుడి ఎడమ చెవుల్లో రెండు ప్రత్యేకమైన శబ్ద తరంగాలను పంపితే అంటే ఒకేసారి రెండు శబ్ద తరంగాలను పంపినప్పుడు మెదడు కేవలం వాటిలో తనకు బాగా ఇష్టమైన ఒక తరంగాన్ని మాత్రమే రీసీవ్ చేసుకుంటుంది. రెండో తరంగం వెళ్లినా అది మెదడుపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. తనకు బాగా ఇష్టమైన శబ్ద తరంగాలను మాత్రమే అది పూర్తిగా గ్రహిస్తుంది. అలా గ్రహించిన తర్వాత అనేక విధాలైన మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. అందువల్లే క్రమం తప్పకుండా సంగీతం వినేవాళ్లకు ఆరోగ్యం చాలా బాగుంటుందని ఎన్నోమార్లు ఎన్నో అధ్యయనాల్లో రుజువయ్యింది. రెండు చెవులద్వారా మెదడుకు చేరిన బైనరల్ శబ్ద తరంగాలు శరీరంమీద, ఆత్మమీద గట్టి ప్రభావాన్ని చూపించగలుగుతాయి. అలాగే కుండలినీ చక్రాల్లో ఉన్న చెడు శక్తి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది. తద్వారా ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయి. శబ్దతరంగాలకు ఇంతటి శక్తి ఉన్నది కనుకనే వేద నాదానికి అంతటి ప్రాధాన్యత ఆది నుంచీ ఉందీ దేశంలో. ఈ కాన్సెప్ట్ ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటోందీ సంస్థ. వివిధ ఫ్రీక్వెన్సీల్లో వివిధ సందర్భాలకు చెందిన శబ్ద నాదాల ఆడియోలను, వీడియోలను, హృద్యమైన సంగీతాన్ని అందిస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది.

Next Story
Share it